
Service charge: రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలు.. దిల్లీ హైకోర్టు సీరియస్ వార్నింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాల్సిన విధంగా బిల్లులో వీటిని కలిపివేయడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది.
రకరకాల పేర్లతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానం కిందకి వస్తుందని పేర్కొంది.
సర్వీస్ ఛార్జీలను చెల్లించాలా, వద్దా అనే విషయాన్ని పూర్తిగా వినియోగదారుల విచక్షణకే వదిలేయాలని సూచించింది.
ఈ విధంగా అదనపు ఛార్జీలను విధిస్తున్న హోటళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA)కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Details
వినియోగదారులపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీల భారం
గతంలో సర్వీస్ ఛార్జీలను నిషేధిస్తూ ఈ సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారెంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
ఇప్పటికే 2017లో కేంద్ర ప్రభుత్వం హోటళ్లలో వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు పన్నుల పరిధిలోకి రావని ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం తప్పని స్పష్టం చేసింది.
ఈ రుసుము పూర్తిగా వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు తెలియజేస్తూ, అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని ఆదేశాలిచ్చింది.
మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నాయి.