Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి
ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని మీరట్‌కు చెందిన ఓ కుటుంబం ఆదివారం రాజస్థాన్‌లోని సలాసర్‌లోని బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. పూజ చేసి తిరిగి వస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. సికార్ జిల్లా సమీపంలోని హైవేపై కారు ట్రక్కును ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. పోలీసుల సమాచారం ప్రకారం, కారులో డ్రైవర్‌తో సహా ఏడుగురు ఉన్నారు. కారులోంచి ఎవరూ దిగలేకపోయారు.
పరారీలో ట్రక్కు డ్రైవర్, సహాయకుడు
కారులో కాలిన గాయాలతో వారు చనిపోయారు. హైవే ఖాళీగా ఉండడంతో డ్రైవర్ అతి వేగంగా కారు నడుపుతున్నట్లు తెలిసింది. ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎదురుగా ఓ కారు రావడంతో ఢీకొనకుండా డ్రైవర్ పక్కకు తిప్పాడు. అయితే అదుపు చేయలేక పక్కనే ఉన్న లారీని ఢీకొట్టాడు. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మూసి ఉన్న కారు తలుపును ఎవరూ తెరవలేరు. ప్రత్యక్ష సాక్షి ప్రకారం, ప్రయాణికులు సహాయం కోసం కేకలు వేస్తుండగా, మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో వాహనం వద్దకు వెళ్లలేకపోయారు. కారులో మంటల్లో అందరూ చనిపోయారు. ట్రక్కు డ్రైవర్, సహాయకుడు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.