LOADING...
Maoists: మారేడుమిల్లిలో మ‌రోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి 
మారేడుమిల్లిలో మ‌రోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి

Maoists: మారేడుమిల్లిలో మ‌రోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. జరిగిన ఘర్షణలో ఏడుగురు నక్సలైట్‌లు చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటనలో మరణించిన వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా తెలిసింది. మృతుల్లో మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్‌జీ కూడా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో బలగాల కూంబింగ్‌ కొనసాగుతుండగా, మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధృవీకరించారు.

వివరాలు 

ఏపీ వైపు చొరబడేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు 

పూర్తివివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మిగిలిన మావోయిస్టులు ఆత్మసమర్పణ చేయడం మంచిదంటూ సూచించారు. "ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఏపీ వైపు చొరబడేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కదలికలపై పక్కా నిఘా ఏర్పాటు చేశాం.నవంబర్‌ 17న ఒక భారీ ఆపరేషన్‌ ప్రారంభించాం. ఆ తరువాతి రోజే ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సెంట్రల్‌ కమిటీ సభ్యుడు హిడ్మా మద్వి సహా మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేశాం.

వివరాలు 

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ సమయంలో  కొందరు తప్పించుకున్నారు

అందులో స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెందిన ముగ్గురు, ప్లాటూన్‌ సభ్యులు 23 మంది, డివిజినల్‌ కమిటీ 5 మంది, ఏరియా కమిటీకి చెందిన 19 మంది ఉన్నారు. ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఈ ఆపరేషన్లు నిర్వహించాం. అదనంగా, పట్టుబడిన మావోయిస్టుల నుంచి పెద్ద మొత్తంలో తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాం. తాజాగా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ సమయంలో కొందరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెదుకుతున్నాయి.''

వివరాలు 

ఎదురుకాల్పుల్లోనే హిడ్మా మృతి 

అలాగే హిడ్మా మరణంపై కూడా స్పందించిన ఆయన.. "జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తెలియదు. ఎదురుకాల్పుల సమయంలోనే అతను మృతి చెందాడు. పట్టుకున్న తర్వాత చంపారని వస్తున్న మాటల్లో నిజం లేదు. ఆంధ్రప్రదేశ్‌ను మావోయిస్టు ప్రభావం నుంచి పూర్తిగా దూరం చేయాలన్నదే మా లక్ష్యం. మావోయిస్టుల అసలు ప్రణాళిక ఏమిటో, కానూరులో ఎందుకు దాక్కొన్నారు అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో చాలా మంది లొంగిపోతారని అంచనా ఉంది. అరెస్టుల నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన పని లేదు. ఛత్తీస్‌గఢ్‌లో తరచూ దాడులు జరగడంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు మావోయిస్టులు తరలిపోతున్నారు. ఈ క్రమంలోనే వారు మా చేతుల్లో చిక్కుతున్నారు" అని ఏడీజీ స్పష్టం చేశారు.