LOADING...
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆపరేషన్‌లో కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్‌
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆపరేషన్‌లో కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్‌

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆపరేషన్‌లో కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల కోసం ఏడో రోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ తెలియలేదు. 600 మందితో కూడిన 12 విభాగాల సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నిపుణులు టీబీఎం మిషన్‌ను ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌ ద్వారా కట్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు క్లిష్టతరం కావడంతో, రెండు నుంచి మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కార్మికుల కోసం అత్యాధునిక 'గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌(జీపీఆర్‌)'పరికరాన్ని ప్రభుత్వం ఉపయోగిస్తోంది. గురువారం ఇది సొరంగంలోకి ప్రవేశపెట్టి,పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టి, శిథిలాల కింద ఉన్నదాన్ని పరిశీలిస్తున్నారు. భూగర్భంలోని వస్తువులను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఉపయుక్తంగా ఉంటుంది.

వివరాలు 

మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు కనిపిస్తే..

జీపీఆర్‌ పరికరం విద్యుదయస్కాంత రేడియో తరంగాలను విడుదల చేస్తుంది.ఇవి భూమిలోని రాళ్లు, ఇతర వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. తిరిగి వచ్చే తరంగాల భిన్నతలను పరికరం యాంటెన్నా గుర్తించి,భూగర్భ నమూనాలను చిత్రరూపంలో ప్రదర్శిస్తుంది. మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు కనిపిస్తే,కార్మికుల స్థానం అంచనా వేయడం సులభమవుతుంది. పరిశోధించిన తరువాత తవ్వకాలు చేపట్టి, గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు. నిపుణులు శుక్రవారం ఈ చిత్రాలను విశ్లేషించనున్నారు. బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) పర్యవేక్షణలో,శిథిలాల తొలగింపు,గ్యాస్‌ కట్టర్ల సహాయంతో విరిగిన పరికరాలను కట్‌ చేయడం ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు కార్మికుల సహాయంతో లోకో ట్రైన్‌లోని మూడు కోచ్‌ల నుంచి మట్టి,బురదను బయటకు తరలించారు.

వివరాలు 

డీవాటరింగ్‌ ప్రక్రియ వేగవంతం

సింగరేణి రెస్క్యూ టీం సొరంగ పైకప్పును బలంగా మార్చి, మరింత భద్రతా చర్యలు చేపడుతోంది. సింగరేణి మైన్స్‌ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందాలతో మూడు షిఫ్ట్‌ల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తొలగిస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు ఏర్పాటుచేయనున్నారు. సొరంగ ఇన్‌లెట్‌ నుంచి 13.9 కిలోమీటర్లలోపు ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకోవడం కోసం లోకో ట్రైన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్‌ వరకు తీసుకురావడానికి 300 మీటర్ల మేర సిబ్బంది మోసుకెళ్లాల్సి రావడం సవాలుగా మారింది.

వివరాలు 

సహాయక చర్యల్లో మరింత మంది భాగస్వామ్యం

కన్వేయర్‌ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్‌పైనే ఆధారపడుతున్నారు. వాస్తవానికి, టీబీఎం మిషన్‌ పనిచేసే సమయంలో కన్వేయర్‌ బెల్టు ద్వారా మట్టి, రాళ్లు టన్నెల్‌ వెలుపలికి వస్తాయి. అయితే, ప్రస్తుతం టీబీఎం పనిచేయకపోవడంతో కన్వేయర్‌ వినియోగం కష్టంగా మారింది. సహాయక చర్యల్లో మరింత మంది భాగస్వామ్యం కావాలని, సింగరేణి గనుల నుండి అదనంగా 200 మంది రెస్క్యూ సిబ్బందిని ప్రమాదస్థలానికి పంపనున్నారు. ఇప్పటికే 100 మందికిపైగా సింగరేణి రెస్క్యూ బృందం పనిచేస్తోంది. భూగర్భ ప్రమాదాల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని మరింతగా చేర్చుతున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.