Andhra Pradesh: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడు,పెనమలూరుల్లో అత్యధికంగా 48.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీల వేడి నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 115మండలాల్లో 44డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. మరోవైపు భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్ జిల్లాలో జుజ్జూరుకు చెందిన కోపూరి మోషే(70),కొండపల్లికి చెందిన బుస్సా చిట్టెమ్మ(80), విజయవాడ మొగల్రాజపురానికి చెందిన గొంగటి చంటి(45),వావిలాలకు చెందిన షేక్ నాగుల్ మీరా(52) మృతి చెందారు.
వివరాలు
వడదెబ్బకు మృత్యువాత
కృష్ణా జిల్లాలో ఉంగుటూరుకు చెందిన షేక్ మౌలాలి(42), తెన్నేరుకు చెందిన తాళ్లూరి విజయ్(40) ఎండ వేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా ప్రాతూరు రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి(55) కూడా వడదెబ్బకు బలయ్యాడు. అనకాపల్లి జిల్లా వేంపాడులో ఓ వృద్ధ యాచకురాలు(70) మృతి చెందగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం చిన్నపేటకు చెందిన ఇసుకపట్ల బుజ్జిబాబు(43), పి.గన్నవరంలో గుర్తుతెలియని 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. యర్రంశెట్టివారిపాలేనికి చెందిన కొండేటి చినసత్యవతి(59) కూడా వడదెబ్బతో మరణించారు.
వివరాలు
వడదెబ్బకు మృత్యువాత
కాకినాడ గ్రామీణ పరిధిలోని కూరాడ శెట్టిబలిజపేటకు చెందిన టేకుమూడి సూర్యనారాయణ(80), యు.కొత్తపల్లి మండలం మూలపేటలో గుర్తుతెలియని వ్యక్తి(30), గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటకు చెందిన ఆచార్యులు(85) మృతి చెందిన వారిలో ఉన్నారు. పల్నాడు జిల్లా కట్టావారిపాలేనికి చెందిన చవల తిరుపతమ్మ(80), అంబేడ్కర్ కోనసీమ జిల్లా అనాతవరానికి చెందిన జంగం శివనాగేశ్వరరావు(35), పాలకోడేరు మండలం శృంగవృక్షం శివారుకు చెందిన పి. నాగఅప్పారావు(45), ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం కొర్రగుంటపాలేనికి చెందిన కొండూరి అనసూర్యమ్మ(104) కూడా ఎండల తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయారు.