Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు.. రానున్న రోజుల్లో మరింత తీవ్రత
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో మంగళవారం అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీలు నమోదు కాగా,తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా అనుమలపల్లి, నెల్లూరు జిల్లా కొమ్మిపాడు ప్రాంతాల్లో 43 డిగ్రీలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం, పల్నాడు జిల్లా దుర్గి, శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ప్రాంతాల్లో 42.8 డిగ్రీలు నమోదయ్యాయి.
వివరాలు
నగరి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె 42.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పరపాడు 42 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడు 41.1 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నగరి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు. బుధవారం రాయలసీమ, తీర ప్రాంత జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో నాలుగు మండలాలు, విజయనగరం జిల్లాలో 19 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలు, పోలవరం ప్రాంతంలో నాలుగు మండలాలు, అనకాపల్లి జిల్లాలో రెండు మండలాలు, అలాగే కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.