Rain Alert: పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి (మంగళవారం) ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతాలవైపు చేరుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనిపై అప్రమత్తమైన అధికారులు ఏపీలోని పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరికలు జారీ చేయగా, గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించారు. సముద్రంలో తీవ్ర అల్పపీడనం మార్గం గందరగోళంగా సాగుతుండటంతో దాని కదలికలపై అంచనా వేయడం క్లిష్టమవుతోంది.
మరో రెండు రోజులలో తీవ్ర అల్పపీడనం
ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడుతుందని తొలుత అంచనా వేయబడినప్పటికీ, దాని అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు పయనిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల అల్పపీడన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి పరిస్థితే అరుదుగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రభావం ఈ నెల 26వ తేదీ(గురువారం)వరకు కొనసాగుతుందని భావిస్తున్నప్పటికీ, తీరానికి చేరువగా వెళ్తుందా.. లేదా తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. గత నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు తీరానికి చేరువగా ప్రయాణించిన తర్వాత, మరో రెండు రోజులలో తీవ్ర అల్పపీడనంగా మారి ఏపీ తీరానికి చేరింది.