Bhole Baba: భోలే బాబా నేర చరిత్ర ఇదే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో 121మంది మరణించి 25గంటలకు పైగా గడిచింది. హత్రాస్ సత్సంగంలో తొక్కిసలాటలో 121మంది మరణించిన ఘటనలో భోలే బాబా జాడ ఇంకా గుర్తించలేదు. ఇదే సమయంలో భోలే బాబా పాత క్రిమినల్ కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. 121మంది మరణామికి కారమమై తప్పించుకుని తిరుగుతున్న బాబాకపై పాత నేర చరిత్ర కూడా ఉంది. ఈ బాబా ఇంతకుముందు ఓ కేసులో అరెస్టు కూడా అయ్యారు. నిజానికి భోలే బాబాను 2000లో ఆగ్రాలో పోలీసులు అరెస్టు చేశారు. మిరాక్యులస్ రెమెడీస్ యాక్ట్ కింద నమోదైన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అప్పుడు బాబాతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది.
ఎందుకు అరెస్టు అయ్యాడంటే..
భోలే బాబాకు పిల్లలు లేరు. దీంతో క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలికను దత్తత తీసుకున్నాడు. ఒకరోజు ఆ బాలిక అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన తర్వాత, భోలే బాబా ఆమెకు నయం చేస్తారని అనుచరులు చెప్పుకొచ్చారు. కొంతసేపటి తర్వాత ఆ బాలిక స్పృహలోకి వచ్చి చనిపోయింది. మృతదేహాన్ని ఆగ్రాలోని మాల్ చబుత్రా శ్మశాన వాటికకు తరలించారు. అయితే భోలే బాబా వచ్చి బాలికను సజీవంగా తీసుకువస్తారని అనుచరులు ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుచరులపై లాఠీచార్జి చేశారు. అనంతరం భోలే బాబాను అరెస్టు చేశారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేకపోవడంతో భోలే బాబాతో సహా 7 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
బాబాపై ఆరు కేసులు నమోదు
భోలే బాబాపై లైంగిక వేధింపులు సహా మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు యూపీ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తెలిపారు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయాని తెలిపారు. ఇప్పుడు హత్రాస్ తొక్కిసలాట కేసులో యూపీ పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి 80 వేల మంది వస్తారని చెప్పి, 2.5 లక్షల మందిని తరలించారని ఆరోపణలు ఉన్నాయి. అనుమతి కోరుతూ సత్సంగానికి వచ్చిన భక్తుల అసలు సంఖ్యను నిర్వాహకులు దాచిపెట్టారని, ట్రాఫిక్ నిర్వహణకు సహకరించలేదని, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆధారాలు దాచిపెట్టారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.