Page Loader
కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు
కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడు షారుఖ్ సైఫీ అరెస్టు

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు

వ్రాసిన వారు Stalin
Apr 05, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్‌లో అతనిడి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని షారుఖ్ సైఫీగా గుర్తించారు. కేరళ కోజికోడ్‌లో అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో సహ ప్రయాణికుడికి నిప్పంటించిన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. రత్నగిరిలో పోలీసులకు మంగళవారం అతడి ఆచూకీ లభించింది. అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్‌‌లో తోటి ప్రయాణికుడికి నిప్పంటించి కిందకు దూకడంతో షారుఖ్ సైఫీ తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతడు రత్నగిరి సివిల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. చికిత్స పూర్తికాకుండానే ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు రత్నగిరి ప్రాంతంలో సోదాలు నిర్వహించి షారుఖ్ సైఫీని అదుపులోకి తీసుకున్నారు.

కేరళ

కేరళ రైలులో అగ్నిప్రమాదం పూర్వపరాలు ఇవీ

ఏప్రిల్ 2(ఆదివారం)రాత్రి 9.45 గంటల ప్రాంతంలో అలపుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించాడు. ఫలితంగా కనీసం ఎనిమిది మందికి మంటలంటుకొని గాయాలపాలయ్యారు. ఈ ఘటన తర్వాత ఏడాది వయసున్న చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు రైలు నుంచి తప్పిపోయినట్లు తెలిసింది. అదేరోజు రాత్రి ఎలత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఆ ముగ్గురు శవమై కనిపించారు. మంటలు ఎగిసిపడటం చూసి వారు కిందకు దిగేందుకు ప్రయత్నించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేరళను కుదిపేసిన ఈ ఘటనపై సిట్, ఎన్ఐఏ, ఆర్‌పీఎఫ్ సహా వివిధ దర్యాప్తు సంస్థల సీనియర్ అధికారులు విచారణ చేపట్టారు.