Page Loader
కేరళ కొత్త డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి.. నేడు ఛార్జ్ తీసుకోనున్న దర్వేష్ సాహెబ్
కేరళ కొత్త డీజీపీగా ఏపీ బెస్తవీధి వాసి..నేడు ఛార్జ్ తీసుకోనున్న షేక్ దర్వేష్

కేరళ కొత్త డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి.. నేడు ఛార్జ్ తీసుకోనున్న దర్వేష్ సాహెబ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 30, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి నియామకమయ్యారు. కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్‌ ఆ రాష్ట్ర డీజీపీగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన దర్వేష్ ను కేరళ ప్రభుత్వం పోలీస్‌ బాస్‌ గా నియమించింది. కడప జిల్లాలోని పోరుమామిళ్ల బెస్తవీధికి చెందిన మహబూబ్‌ సాహెబ్‌, గౌసియాబేగం దంపతులకు షేక్ దర్వేష్ సాహెబ్‌ జన్మించారు. ఆయన తండ్రి అటవీశాఖలో ఉద్యోగం చేస్తన్న క్రమంలో బెస్తవీధిలోనే నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే దర్వేష్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదువుకున్నారు. ఆరు నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ,పీజీలను తిరుపతిలో అభ్యసించారు.

details

ఐఏఎస్ లక్ష్యంగా కదిలి ఐపీఎస్ అయిన దర్వేష్ సాహెబ్‌

ఐఏఎస్ అధికారి కావడమే లక్ష్యంగా కదిలిన దర్వేష్ తొలిసారి ఫలితాల్లో ఐఎఫ్ఎస్ కి ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్ టార్గెట్ గా మరోసారి సివిల్స్ కు సన్నద్ధమయ్యారు. ఈసారి కేరళ క్యాడర్‌ ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే కేరళలో పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. నెడుమంగడ్‌లో ఏఎస్పీగా తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన షేక్, అనంతరం వయనాడ్, కాసరగోడ్, కన్నూర్ , పాలక్కాడ్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. రాష్ట్ర రైల్వే పోలీస్, స్టేట్ స్పెషల్ బ్రాంచ్‌లోనూ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించారు. సాయుధ బెటాలియన్‌లోనూ పనిచేశారు. కొసోవాలోని యూఎన్‌ శాంతి పరిరక్షక మిషన్‌లో భాగంగా కృషి చేశారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీలో ఏడీగా, డిప్యూటీ డైరెక్టర్‌గానూ పనిచేసిన అనుభవం పొందారు.

DETAILS

సొంతూరు బెస్తవీధిలో వెల్లివిరిసిన ఆనందోత్సవాలు

పదోన్నతి తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్, క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, లా అండ్ ఆర్డర్, నార్త్ జోన్‌లో అదనపు డీజీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌లో డైరెక్టర్ జనరల్ హోదాలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేరళ డీజీపీగా అవకాశం ఇచ్చింది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ కాంత్ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. కేరళలోని వివిధ జిల్లాల్లో గతంలో జిల్లా పోలీస్ బాస్ ( ఎస్పీగా ) పనిచేసి ఇప్పుడు రాష్ట్రానికే పోలీస్ బాస్ గా (డీజీపీగా) నియామకం కావడం పట్ల సొంతూరు బెస్తవీధిలో ఆనందం వెల్లివిరిసింది.