India Covert Operation: మయన్మార్‌లో భారత కోవర్ట్ ఆపరేషన్.. 'శౌర్యచక్ర'తో వెలుగులోకి..!
ఈ వార్తాకథనం ఏంటి
మయన్మార్ భూభాగంలో భారత్ అత్యంత గోప్యంగా ఓ ప్రత్యేక ఆపరేషన్‌ను అమలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశ భద్రతకు ముప్పుగా మారిన మిలిటెంట్ గుంపులే లక్ష్యంగా గత ఏడాది ఈ కోవర్ట్ ఆపరేషన్‌ను భారత సైన్యం నిర్వహించింది. తాజాగా ప్రకటించిన 'శౌర్యచక్ర' అవార్డుల జాబితాతో ఈ రహస్య మిషన్ గురించి అధికారికంగా తెలిసింది. సాధారణంగా ఇలాంటి రహస్య సైనిక చర్యలను కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించడం చాలా అరుదు. 21వ పారా స్పెషల్ ఫోర్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగె ఆదిత్య శ్రీకుమార్‌కు కేంద్రం 'శౌర్యచక్ర' పురస్కారాన్ని ప్రకటించింది. మయన్మార్‌లో అత్యంత నిశితత్వంతో ఆపరేషన్ నిర్వహించి మిలిటెంట్ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసినందుకే ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది.
వివరాలు
దాడుల్లో మొత్తం 9 మంది మిలిటెంట్ నాయకులు మృతి
అయితే, ఆ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం బయటపెట్టలేదు. దేశ వ్యతిరేక శక్తులకు చెందిన శిబిరాలే లక్ష్యంగా ఈ చర్య చేపట్టామని మాత్రమే స్పష్టం చేసింది. భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో 2025 జులై 11 నుంచి 13 మధ్య ఈ ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో మొత్తం 9 మంది మిలిటెంట్ నాయకులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణుల ద్వారా జరిగిన దాడుల్లో తమ సంస్థకు చెందిన కీలక నేతలు మరణించినట్లు గతేడాది జులైలో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఇండిపెండెంట్) [ఉల్ఫా (ఐ)] ప్రకటించింది.
వివరాలు
భారత్‌కు మయన్మార్‌తో సుమారు 1600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు
ఈ దాడుల వెనుక భారత సైన్యమే ఉందని అప్పట్లో ఆ సంస్థ ఆరోపణలు చేసింది. అయితే, ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. భారత్‌కు మయన్మార్‌తో సుమారు 1600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. అస్సాంకు ప్రత్యేక హోదా కోరుతూ ఉల్ఫా (ఐ) గత కొన్ని సంవత్సరాలుగా ఈ సరిహద్దు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి.