LOADING...
Rajasthan : భర్తతో విడిపోయి ప్రేమలో పడింది.. కానీ ఆ ప్రేమే ప్రాణం తీసింది!
భర్తతో విడిపోయి ప్రేమలో పడింది.. కానీ ఆ ప్రేమే ప్రాణం తీసింది!

Rajasthan : భర్తతో విడిపోయి ప్రేమలో పడింది.. కానీ ఆ ప్రేమే ప్రాణం తీసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ముకేశ్ కుమారి అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఆరాటం చివరికి ఆమె ప్రాణాలు తీసింది. ముకేశ్ కుమారి అక్కడ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. గతేడాది ఆమె బార్మేర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మనారామ్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. మనారామ్ కూడా వివాహితుడు. అయితే భార్యతో విడిపోయి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముకేశ్ కుమారి తరచూ దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మనారామ్‌ను కలిసేది. అతడిని పెళ్లి చేసుకోవాలని పలు సార్లు అడిగింది.

Details

ఇద్దరి మధ్య తరుచూ విభేదాలు

మనారామ్ కూడా మాట ఇచ్చినా.. ప్రతిసారి సాకులు చెప్పి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి. ఈ నెల 10వ తేదీన ముకేశ్ కుమారి తన ఆల్టో కారులో ఝున్‌ఝున్ నుంచి బార్మేర్ చేరుకుంది. అక్కడ మనారామ్ కుటుంబ సభ్యులకు తమ ప్రేమ గురించి తెలిపింది. దీంతో ఘర్షణ చెలరేగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఇరువురికి సర్దిచెప్పారు. ఆ సమయంలో మనారామ్ కూడా ఇప్పటికి పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి తరువాత మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఆమె శాంతించింది. అయితే అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి కారులో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు.

Details

హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు

అక్కడ మనారామ్, ముకేశ్ కుమారి తలపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. గాయాల వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత మృతదేహాన్ని కారులోనే వదిలి మనారామ్ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముకేశ్ కుమారి, మనారామ్ ఒకే ప్రదేశంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టడీలోకి తీసుకున్న మనారామ్ విచారణలోనే తానే ముకేశ్ కుమారిని హత్య చేశానని ఒప్పుకున్నాడు.