Loading...
Shehzad Poonawalla: ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా

Shehzad Poonawalla: ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మరోసారి తన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు. ఆర్థిక,వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీలో కొందరి వైఖరి కూడా తన నిర్ణయాన్ని మరింత బలపరిచిందని తాజాగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకున్నారు. తొలుత తన నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం గౌరవించిందని, అయితే రాజీనామాను వెంటనే ఆమోదించకుండా మరోసారి ఆలోచించాలని కోరిందని పూనావాలా తెలిపారు. అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

'వ్యవస్థను మాత్రమే వీడుతున్నా.. సిద్ధాంతాలను కాదు'

గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ ఆమోదించకపోవడంతో మరోసారి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు లేఖ రాశారు. తనను బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తప్పించాలని కోరారు.

తన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన రాజకీయ కారణాలేవీ లేవని పూనావాలా స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ,బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్,కేంద్ర మంత్రులు అమిత్ షా,రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.

''నేను బీజేపీ వ్యవస్థ నుంచి మాత్రమే బయటకు వస్తున్నాను.. సిద్ధాంతాల నుంచి కాదు'' అని ఆయన పేర్కొన్నారు.

తాను ఎప్పటికీ ప్రధాని మోదీకి వీరాభిమానిగానే ఉంటానని చెప్పారు.

భవిష్యత్తులోనూ తనకు సాధ్యమైనంత మేరకు బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.

వివరాలు 

ఆ 'కొందరు' ఎవరు?

గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కూడా తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని పూనావాలా తన లేఖలో పేర్కొన్నారు.

అయితే తన నిర్ణయాన్ని ప్రభావితం చేసిన ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

వారి వ్యవహారశైలిపై ఇప్పటికే పార్టీ నాయకత్వంతో తాను చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇక భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని పూనావాలా స్పష్టం చేశారు.

రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రైవేటు రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

''అత్యవసరమైన ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'' అని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి..

మహారాష్ట్రకు చెందిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

తొలుత కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నిస్తూ అప్పట్లో వార్తల్లో నిలిచారు.

అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2021లో బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన తర్వాత పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం ముఖంగా పూనావాలా గుర్తింపు పొందారు.

టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున తరచూ వాదనలు వినిపించేవారు.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి..

హిందుత్వ భావజాలాన్ని బలంగా ప్రచారం చేయడంతో పార్టీ అధినాయకత్వం ఆయనకు ప్రాధాన్యం ఇచ్చింది.

2021లో బీజేపీ ఢిల్లీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను కూడా నిర్వహించారు.

ఆ తర్వాత టీవీ డిబేట్లలో పార్టీ ప్రతినిధిగా తరచూ పాల్గొన్నారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలను గుర్తుచేసుకుంటూ.. గత ఐదేళ్లుగా తనకు వేదిక కల్పించి, గౌరవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే తాజాగా ఆయన రాజీనామా నిర్ణయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షెహజాద్ పూనావాలా చేసిన ట్వీట్ 

ADVERTISEMENT