LOADING...
Cockroach Janta Party: 'బొద్దింకల పార్టీ'కి షాక్‌.. సోషల్ మీడియా అకౌంట్లు మాయం!
'బొద్దింకల పార్టీ'కి షాక్‌.. సోషల్ మీడియా అకౌంట్లు మాయం!

Cockroach Janta Party: 'బొద్దింకల పార్టీ'కి షాక్‌.. సోషల్ మీడియా అకౌంట్లు మాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్‌గా మారింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ ప్లాట్‌ఫామ్ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం మాట్లాడుతూ తమ సంస్థపై అణిచివేత చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తమ సోషల్ మీడియా అకౌంట్లను తొలగించడం, హ్యాకింగ్ చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సోషల్ మీడియా ఖాతాలకు యాక్సెస్ లేకుండా పోయిందని వెల్లడించారు. తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయినట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

వివరాలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

ఇటీవల నీట్ యూజీసీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీజేపీ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ ప్రచారం తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందని, బెదిరింపులు వస్తున్నాయని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే, ప్రస్తుతం తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నియంత్రణ కోల్పోయినందున "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో వెలువడే ఎలాంటి ప్రకటననైనా అధికారిక ప్రకటనగా పరిగణించవద్దని దీప్కే స్పష్టం చేశారు.

వివరాలు

పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

ఇదిలా ఉండగా, సీజేపీపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. గతంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, ఆయనకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అమ్ ఆద్మీ పార్టీ, అలాగే అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా, సీజేపీ ఫాలోవర్లలో ఎక్కువ మంది బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌కు చెందిన వారేననే వాదనలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement