Telangana: 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉండాలా.. వద్దా..! విద్యారంగంలో విస్తృత చర్చ.. వివిధ వర్గాల్లో భిన్న వాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఇంటర్మీడియట్ విద్యను 11, 12వ తరగతులుగా పరిగణించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనే అంశంపై విద్యారంగంలో చర్చ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు. తుది ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ..
విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఎక్కువ మంది 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.
ఇంటర్ విలీన ప్రక్రియ పూర్తయితే మిగిలిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
విలీనానికి సంబంధించిన ముసాయిదా నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినప్పుడు పరీక్షల నిర్వహణపైనా ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు.
ఈ అంశంపై విద్యారంగ నిపుణులు, అధికార వర్గాల్లో మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
వివరాలు
11వ తరగతికి బోర్డు పరీక్షలు ఎందుకు వద్దంటున్నారు?
పదో తరగతి నుంచి 12వ తరగతి వరకు వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అందుకే 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదని సూచిస్తున్నారు.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతోపాటు అనేక దేశాల్లో 11వ తరగతికి ప్రత్యేకంగా బోర్డు పరీక్షలు నిర్వహించడం లేదు.
అయితే పాఠశాల స్థాయిలో మాత్రం పరీక్షలు తప్పనిసరిగా ఉంటాయి.
తెలంగాణ విద్యాకమిషన్ కూడా 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని సూచించింది.
ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు పాఠ్యాంశాలపై లోతైన అవగాహన కల్పించడం, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది.
చదువు అంటే కేవలం పరీక్షలు రాయడం, మార్కులు సాధించడం మాత్రమే కాదని అభిప్రాయపడింది.
వివరాలు
బోర్డు పరీక్షలు ఎందుకు అవసరమంటున్నారు?
తమిళనాడు ప్రభుత్వం కూడా 2025-26 విద్యాసంవత్సరం నుంచి 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందని కొందరు విద్యావేత్తలు చెబుతున్నారు.
విద్యార్థులు కూడా సొంతంగా చదువుకునే అలవాటు కలిగి ఉంటారని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయని వివరిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో 90 శాతానికి పైగా పేద కుటుంబాలకు చెందినవారే ఉన్నారు.
ఈ నేపథ్యంలో 11వ తరగతికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నారు.
వివరాలు
విద్యార్థుల హాజరు తగ్గే ప్రమాదం.. పరీక్షలతో ఆత్మవిశ్వాసం పెరుగుదల
గురుకులాలు, రెసిడెన్షియల్ విధానంలో నడిచే కళాశాలలను మినహాయిస్తే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సగటు విద్యార్థుల హాజరు 65 శాతానికి కూడా మించడం లేదు.
చాలా మంది విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా తక్కువగానే ఉంటోంది.
ఇలాంటి పరిస్థితుల్లో 11వ తరగతికి బోర్డు పరీక్షలు లేకపోతే హాజరు శాతం మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, రెండో సంవత్సరం పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ప్రథమ సంవత్సరంలో తక్కువ ఉత్తీర్ణత.. పరీక్షలు రద్దు చేస్తే మరింత ప్రభావం?
పదో తరగతితో పోలిస్తే ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాఠ్యాంశాల పరిధి మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి సమయంలో 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు మొదటి ఏడాది పాఠ్యాంశాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.
ఇటీవల మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే ఈ వాదనకు బలం చేకూరుతోందని పేర్కొంటున్నారు.
ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 75.61శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 66.94శాతం మందే పాసయ్యారు.
ఇప్పటికే మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తే ఫలితాలు మరింత పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ప్రవేశ పరీక్షల సన్నద్ధతపై ప్రభావం పడే అవకాశం
అంతేకాకుండా 11వ తరగతిలోని పాఠ్యాంశాలపై సరైన అవగాహన లేకపోతే 12వ తరగతి చదువుకోవడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు కూడా రెండేళ్ల సిలబస్ ఆధారంగానే నిర్వహిస్తారు.
కాబట్టి మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించడం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు 11వ తరగతికి బోర్డు పరీక్షలు లేకపోతే కొన్ని కార్పొరేట్ కళాశాలలు సాధారణ విద్యపై దృష్టి తగ్గించి, కేవలం ప్రవేశ పరీక్షల సన్నద్ధతకే ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
తుది నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ
దీంతో విద్యార్థులకు సమగ్ర విద్య అందకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించాలనే వాదన ఒకవైపు.. చదువులో క్రమశిక్షణ, పాఠ్యాంశాలపై పట్టు, మెరుగైన ఫలితాల కోసం పరీక్షలు అవసరమనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది.
ప్రభుత్వం ముసాయిదా నివేదికపై ప్రజాభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.