శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు. పోలీసుల ఛార్జ్‌షీట్ ప్రకారం, శ్రద్ధా వాకర్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లింది. అది పూనావాలాకు నచ్చలేదు. దీంతో గతేడాది మే 18న ఆమె గొంతుకోసి హత్య చేశారు. అంతకు ముందే వీరి మధ్య పెళ్లి గురించి పలు మార్లు వాగ్వాదం జరిగింది. ఈ కేసులో 302, 201 సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందుకోసం 150కి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు.
ఫిబ్రవరి 7 వరకు పూనావాలా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
అమెరికన్ క్రైమ్ సిరీస్ అయిన 'డెక్స్టర్' స్ఫూర్తితోనే శ్రద్ధా శరీరాన్ని 35 ముక్కలుగా చేసినట్లు పూనావాలా పోలీసుల విచారణలో చెప్పారు. శరీరాన్ని ముక్కలు చేయడానికి రంపంతో సహా ఐదు రకాల ఆయుధాలను వాడినట్లు పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. 2019లో ఆన్‌లైన్ డేటింగ్ యాప్ శ్రద్ధా, పూనావానా పరిచయమయ్యారు. ముంబయిలో ఒకే కాల్ కాల్ సెంటర్‌లో పనిచేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. మతాలు వేరు కావాడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ జంట తమ నివాసాన్ని గత సంవత్సరం మెహ్రౌలీకి మార్చింది. అక్కడే శ్రద్ధాను పూనావాలా హత్య చేశాడు. ఇదిలా ఉంటే, పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఫిబ్రవరి 7 వరకు సాకేత్ కోర్టు పొడిగించింది.