దిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు, కారు అద్దంలో చేయి ఇరుక్కున్నా ఈడ్చుకెళ్లిన డ్రైవర్
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్‌ను ఓ డ్రైవర్ వేధించాడు. ఆమె చేయి కారు అద్దంలో ఇరుక్కోగా, అమెను అలాగే కొంతదూరం లాక్కెళ్లాడు. రాత్రి 3గంటల సమయంలో ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. దిల్లీలో మహిళల భద్రతను పరిశీలించేందుకు తన బృందంతో కలిసి స్వయంగా దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి రంగంలోకి దిగారు. రాత్రి 3గంటల సమయంలో తన బృందాన్ని పక్కన ఆపి, ఆమె ఒంటరిగా రోడ్డుపైకి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ వచ్చి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. తన కారు ఎక్కాలని డ్రైవర్ బలవంతం పెట్టాడు.
కారు డ్రైవర్ అరెస్టు, వాహనం స్వాధీనం
ఆ కారు డ్రైవర్ వేధింపులు మితిమీరడంతో అతనిని పట్టుకునేందకు స్వాతి కారు లోపలికి చేయి పెట్టారు. డ్రైవర్ వెంటనే కారు అద్దాన్ని పైకి లేపాడు. ఈ క్రమంలో ఆమె చేయి కారు అద్దంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో కారు డ్రైవర్ ఆపకుండా కొద్దిదూరం అలాగే ఈడ్చెకెళ్లాడు. ఇది గమనించిన మహిళా కమిషన్ సిబ్బంది వెంటనే స్వాతి వద్దకు వెళ్లి ఆమెను రక్షించారు. వెంటనే కారు డ్రైవరు అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిట్ అండ్ డ్రాగ్ కేసులు దిల్లీలో పెరుగుతున్న నేపథ్యంలో అదుపు చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దిల్లీ మహిళా కమిషన్ కూడా మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.