దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ
దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. 20ఏళ్ల అంజలి సింగ్ తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో అంజలి కాలు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమెను కారు దాదాపు 13కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో అంజలి మరణించగా.. ఆమె స్నేహితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 40గాయాలతో అంజలి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
సకాలంలో స్పందించకపోవడవం వల్లే కంట్రోల్ రూమ్ సిబ్బందిపై వేటు
అంజలిని కారు ఢీకొట్టి 13కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో.. ఆ రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కూడా కేంద్ర హోం శాఖ బాధ్యులను చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మందిపై వేటు వేసింది. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 1 కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఐదుగురిని రోడ్డుపై పికెటింగ్‌లో ఉంచగా.. ఆరుగురిని పీసీఆర్ వ్యాన్‌లో విధులు నిర్వహించారు. మహిళ మరణంపై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించినా.. సకాలంలో వారు స్పందించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేంద్ర హోం శాఖ చర్యలకు ఉపక్రమించింది.