Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ.. మీడియాపై సిద్ధరామయ్య అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంచెం అసహనం వ్యక్తం చేశారు. "పార్టీ అధిష్ఠానం నుంచి నాకు ముఖ్యమంత్రి మార్పు గురించి ఎలాంటి సమాచారం అందలేదు" అని ఆయన స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పుపై చర్చలు సాగుతుండగా, ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ, "ఇలాంటి విషయాలపై కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అంశంపై ప్రజలకంటే మీడియానే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
కాంగ్రెస్ అధిష్ఠానంతో సిద్ధరామయ్య, డీ.కె.శివకుమార్‌లు చర్చలు
అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి పార్టీ అగ్రనేతలు ఈ అంశంపై ఏదైనా అధికారికంగా ప్రకటించిన తర్వాతే తాను మాట్లాడతానని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇక బీహార్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు అంశంపై సిద్ధరామయ్య, డీ.కె.శివకుమార్‌లు వేర్వేరుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 11న డీ.కె. శివకుమార్ ఢిల్లీకి వెళ్లి నేతలతో భేటీ కానుండగా, నవంబర్ 15న సిద్ధరామయ్య పార్టీ అగ్రనేతలను కలవనున్నారు అని సమాచారం.