Simran Bala: కర్తవ్యపథ్‌పై పురుషుల సీఆర్‌పీఎఫ్ బృందానికి నాయకత్వంవహించిన మహిళా .. ఎవరీ సిమ్రన్ బాలా?
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 26 ఏళ్ల సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పారామిలిటరీ దళానికి చెందిన పూర్తిగా పురుషులతో కూడిన బృందానికి ఆమె నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 147మంది పురుష సిబ్బంది బృందాన్ని ఆమె ముందుండి నడిపించారు. కర్తవ్యపథ్‌పై సీఆర్‌పీఎఫ్ ఫోర్స్ బ్యాండ్ వాయించిన 'దేశ్ కే హమ్ హై రక్షక్'గీతానికి అనుగుణంగా ఈ బృందం శిస్తుగా కవాతు చేసింది. గతంలో గణతంత్ర పరేడ్‌లో మహిళా సీఆర్‌పీఎఫ్ అధికారులు బృందాలకు నాయకత్వం వహించిన సందర్భాలు ఉన్నప్పటికీ,పూర్తిగా పురుషుల బృందాన్ని ఒక మహిళ నడిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
వివరాలు
పారామిలిటరీ దళంలో ఆఫీసర్ హోదాలో సేవల్లోకి వచ్చిన తొలి మహిళ
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో,పాక్ సరిహద్దుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌషెరా గ్రామంలో సిమ్రన్ బాలా జన్మించారు. జమ్మూలోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఏడాది క్రితమే సీఆర్‌పీఎఫ్‌లో చేరిన ఆమె, తన జిల్లాలో నుంచి పారామిలిటరీ దళంలో ఆఫీసర్ హోదాలో సేవల్లోకి వచ్చిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని 'బస్తారియా' బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సిమ్రన్ కుటుంబానికి సైనిక నేపథ్యం ఉండటం గమనార్హం. ఆమె తండ్రి, తాత ఇద్దరూ ఆర్మీలో సేవలందించారు. ఇదే పరేడ్‌లో ఆయుధ వ్యవస్థల ప్రదర్శనలో భాగంగా 'సూర్యాస్త్ర' రాకెట్ లాంచర్ వ్యవస్థను తొలిసారిగా ప్రజల ముందు ఉంచారు.
వివరాలు
'సూర్యాస్త్ర' బృందానికి మెహక్ భాటి నాయకత్వం
సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ ఆధునిక వ్యవస్థను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ 'సూర్యాస్త్ర' బృందానికి భారత సైన్యానికి చెందిన ఆర్టిలరీ రెజిమెంట్ అధికారిణి లెఫ్టినెంట్ మెహక్ భాటి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మెహక్ భాటి మాట్లాడుతూ,గణతంత్ర పరేడ్‌లో 'సూర్యాస్త్ర' బృందాన్ని నడిపించే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు.
వివరాలు
రాకెట్ లాంచర్ వ్యవస్థను త్వరలోనే భారత సైన్యంలోకి..
ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థను త్వరలోనే భారత సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒకే లాంచర్ నుంచి వివిధ క్యాలిబర్‌ల రాకెట్‌లను ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉందని, దీని ద్వారా దీర్ఘశ్రేణి దాడుల సామర్థ్యం మరింత బలపడుతుందని వెల్లడించారు. లెఫ్టినెంట్ మెహక్ భాటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారు. ఆమె నానమ్మ, తండ్రి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.