Telangana: తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు.. అధిక ధరలతో సింగరేణికి దూరమవుతున్న పరిశ్రమలు
ఈ వార్తాకథనం ఏంటి
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి,విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త గనుల ప్రారంభం లేకపోవడం,ఇప్పటికే ఉన్న గనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం వల్ల సంస్థ పనితీరు మందగిస్తోంది. సింగరేణి బొగ్గు ధరలు ఇతర సంస్థలతో పోలిస్తే ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు సుమారు 20 పరిశ్రమలు అక్కడి నుంచి బొగ్గు కొనుగోళ్లు నిలిపివేశాయి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు జరిగే బొగ్గు సరఫరానే సింగరేణికి ప్రధాన ఆధారంగా మారింది. అయితే అధిక ధరల కారణంగా ఈ ప్లాంట్ల యాజమాన్యాలు కూడా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నాయి. సింగరేణి బొగ్గు ధరల వల్ల తమపై అదనపు భారం పడుతోందని జెన్‌కో తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
వివరాలు
తగ్గిన గణాంకాలు
ఇదే అంశాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి సమర్పించిన నివేదికలో కూడా ప్రస్తావిస్తూ, బొగ్గు ధరల కారణంగానే విద్యుదుత్పత్తి వ్యయం పెరుగుతోందని స్పష్టం చేసింది. గణాంకాలు పరిశీలిస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 65.53 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయగా, 2024-25 నాటికి ఇది 65.23 మిలియన్ టన్నులకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు తొమ్మిది నెలల్లో 51.47 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అమ్మకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ, వాస్తవంగా 43.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే చేసి,44.17 మిలియన్ టన్నుల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఉత్పత్తి 6.69 శాతం,అమ్మకాలు 4.35 శాతం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
జెన్‌కో సింగరేణికి లేఖ
కోల్ ఇండియాతో పోలిస్తే సింగరేణి బొగ్గు విక్రయ ధరలు కొన్ని గ్రేడ్‌లలో టన్నుకు దాదాపు రెట్టింపు వరకు ఉన్నాయని సమాచారం. అధిక ధరలు చెల్లిస్తున్నప్పటికీ నాణ్యమైన బొగ్గు సరఫరా కావడం లేదని జెన్‌కో సింగరేణికి లేఖ రాసింది. నాణ్యత లేని బొగ్గు కారణంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కాకుండా కాలుష్య ఉద్గారాలు పెరుగుతున్నాయని జెన్‌కో ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై జాతీయ విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
వివరాలు
బొగ్గు ఉత్పత్తి, అధిక ధరలపై తీవ్ర అసంతృప్తి
సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉన్నాయని, కోల్ ఇండియా లేదా మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి సరఫరా అవకాశాలను పరిశీలించాలని కేంద్ర బొగ్గు శాఖను ఎన్టీపీసీ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ బొగ్గు ఉత్పత్తి సంస్థల సమావేశంలో సింగరేణి పనితీరు, నాసిరకం బొగ్గు ఉత్పత్తి, అధిక ధరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని ఓ అధికారి వెల్లడించారు.