Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు
తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల వల్ల సింగరేణి(Singareni) గుర్తింపు సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు కూడా వెలువడిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని లేబర్ కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఉంటాయని డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే సింగరేణి ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. సింగరేణి కార్మిక సంఘాల నాయకులతో శ్రీనివాసులు సోమవారం సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఏకాభిప్రాయం కుదరడంతో ఆయన తేదీని కూడా ప్రకటించారు.
కార్మిక సంఘాల నాయకులతో డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశం
కార్మికుల ఓటరు లిస్టును ఇప్పటికే ఎన్నికల అధికారికి అందజేసినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియతో పాటు గుర్తుల కేటాయింపు కూడా ఇప్పటికే ముగిసంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైకోకోర్టు ఆదేశాలతో పోలింగ్ వాయిదా పడింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు 2017లో జరగ్గా.. అందులో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపొందింది. మొత్తం 11 ఏరియాలు ఉండగా..9స్థానాల్లో విజయం సాధించింది. డిప్యూటీ లేబర్ కమిషనర్‌తో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, నాయకులు పాల్గొన్నారు.