Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య పోటీ
తెలంగాణకు కొంగుబంగారంగా చెప్పుకునే సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే కార్మికశాఖ నిర్వహిస్తోంది. సింగరేణి పరిధిలోని మొత్తం 11 ఏరియాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ఓట్ల కౌంటింగ్ రాత్రి 7గంటల నుంచి ప్రారంభమవుతుందని కార్మికశాఖ పేర్కొంది. 11 కేంద్రాల్లో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరిణి గుర్తింపు సంఘం ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సహా మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ప్రధానంగా కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ దూరంగా ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన టీబీజీకేఎస్.. ఏఐటీయూసీ మద్దతు ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో 13 సంఘాలు బరిలో నిలిచినా.. ప్రధాన పోటీ మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్యే ఉంటుందని సింగరేణి కార్మికులు చెబుతున్నారు.