Page Loader
Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం
సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం

Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.1.25 కోట్ల మేర నష్ట పరిహారం అందేలా ఒక ప్రత్యేక ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరాం వెల్లడించారు. ఈ పథకం అమలుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)తో సింగరేణి ఒప్పందం కుదుర్చుకున్నదని, ఇది సంస్థ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ ఒప్పందంపై బలరాం మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కంపెనీ తమస్థాయిలో సాయం చేస్తోందన్నప్పటికీ, మరింత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రమాద బీమా పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

రూ.1.25కోట్ల ప్రమాద బీమా కవచాన్ని అమలుకు పీఎన్‌బీ 

ఇతర బ్యాంకులతో పోలిస్తే పీఎన్‌బీ ముందుగా స్పందించిందని,రూ.1.25కోట్ల ప్రమాద బీమా కవచాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా,ఉద్యోగి సహజ మరణం జరిగిన సందర్భంలో రూ.10లక్షల జీవిత బీమా పరిహారాన్ని కూడా అందించేందుకు బ్యాంకు అంగీకరించినట్టు తెలిపారు. ఇంతకుముందే సింగరేణి తమ సహాయక సేవల విభాగానికి చెందిన ఉద్యోగుల కోసం రూ.40 లక్షల బీమా రక్షణ అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఒప్పందంపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అశోక్ చంద్ర కూడా మాట్లాడారు. గురువారం నుంచే ఈ కొత్త బీమా పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు బ్యాంకు నుంచి పూర్తిగా సహాయం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు.