Singareni: ఆర్థిక ఇబ్బందుల్లో సింగరేణి.. ఓవర్‌డ్రాఫ్ట్‌పై జీతాలు చెల్లించే పరిస్థితి
ఈ వార్తాకథనం ఏంటి
నల్ల బంగారం పేరుతో వెలుగొందిన సింగరేణి ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయింది. నెలకు 40,716 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే కూడా బ్యాంకుల ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఆధారంగా తీసుకుని అప్పు తెచ్చుకునే పరిస్థితికి చేరింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి తీసుకుంటున్న బొగ్గు, కరెంటుకు సంబంధించిన నెలవారీ బిల్లులు చెల్లించకుండా వాయిదా వేస్తుండటంతో బకాయిల మొత్తం సుమారు రూ.29 వేల కోట్ల వరకూ చేరింది. వెంటనే చెల్లించాలంటూ సింగరేణి తాజాగా ఆ సంస్థలకు లేఖలు పంపింది. బకాయిలు తీర్చేందుకు బయటి రుణాలు చూస్తున్నామని, బొగ్గు సరఫరా మాత్రం ఆపకూడదని తెలంగాణ జెన్‌కో సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
వివరాలు
డిస్కంలు 90 రోజుల్లో బిల్లులు క్లియర్ చేయకపోతే...
తెలంగాణ విద్యుత్ సంస్థలు బిల్లులు నిలిపివేసినా,ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ స్టేషన్లు మాత్రం తమకున్న బకాయిలను సమయానికి చెల్లిస్తున్నందువల్లే సింగరేణి రోజువారీ ఖర్చులు ఎలా అయినా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. రోజుకు దాదాపు 1.52 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిలో మూడొంతు వరకూ తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నా, అక్కడి నుంచి బిల్లులే రావడం లేదు. జెన్‌కో ఒక్కటే చెల్లించాల్సిన మొత్తం ఇప్పటికే రూ.17 వేల కోట్లకు ఎగబాకింది. డిస్కంల బకాయిలు కూడా దాదాపు రూ.12 వేల కోట్లకు చేరాయి. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం డిస్కంలు 90 రోజుల్లో బిల్లులు క్లియర్ చేయకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
వివరాలు
పడిపోయిన డిమాండ్ - తగ్గుతున్న ఉత్పత్తి
కానీ జెన్‌కో, డిస్కంలూ, సింగరేణీ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీన సంస్థలే కాబట్టి..నిబంధనలు ఉన్నా సరఫరా నిలిపివేయలేని పరిస్థితి నెలకొంది. సౌర,పవన,జలవనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ బొగ్గు అవసరం తగ్గుతోంది. అంతేకాక, సింగరేణి బొగ్గు రేట్లు ఎక్కువయ్యాయని పరిశ్రమలు బొగ్గు కొనడంలో వెనక్కి తగ్గుతున్నాయి. దీంతో ధరలు కొంత తగ్గించినా సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. 2023-24లో మొత్తం 6.90కోట్ల టన్నుల బొగ్గు రవాణా కాగా,తర్వాతి ఏడాది లోపలే 38 లక్షల టన్నులు తగ్గి కంపెనీ టర్నోవర్‌పై ప్రభావం పడింది. కార్మికులు పూర్తిగా పని చేయకపోవడమూ ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం. 2018-19లో ఒక ఉద్యోగి ఒక్క షిఫ్ట్‌లో సగటున 6.23టన్నుల బొగ్గు తీయగా,2024-25 నాటికి అది 5.41టన్నులకు పడిపోయింది.