Methanol: సింగరేణి కొత్త ప్రాజెక్ట్.. మిథనాల్ తయారీకి ముందడుగు!
సింగరేణి సంస్థ మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోనే తొలిసారి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పన్నమయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించి మిథనాల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సింగరేణి యోచిస్తోంది. ఈ ప్లాంట్ రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ నుంచి 180 కిలోల మిథనాల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. కోల్ ఇండియా, ప్రైవేట్ సంస్థలతో కలిసి నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైతే, పెద్ద స్థాయి మిథనాల్ ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించే ప్రణాళికలు కూడా సిద్ధం ఉన్నాయి. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది.
హైడ్రోజన్ తో కలిపి మిథనాల్ తయారీ
ఈ ప్లాంట్ ద్వారా బొగ్గు మండించిన తర్వాత ఉత్పన్నమయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించి, హైడ్రోజన్‌తో కలిపి మిథనాల్ తయారు కానుంది. వాయువుల ఉద్గారాలను వాతావరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్ (ఎస్పీ) ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం సింగరేణి, కోల్ ఇండియా, సీఎం పీడీఐఎల్ (కోల్ ఇండియా రీసెర్చ్ యూనిట్) వంటి సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రీత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. నిర్మాణం వచ్చే నెల 31 నాటికి పూర్తవుతుందని, త్వరలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు
మిథనాల్‌ను విస్తృతంగా ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, మిథనాల్‌ను వివిధ పరిశ్రమలకు విక్రయించడం ద్వారా సంస్థకు, అలాగే దేశానికి ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో 120 మిలియన్ టన్నుల మిథనాల్ అవసరాలలో 80 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా, దేశీయ పరిశ్రమలకు కూడా చాలా లాభదాయకంగా మారే అవకాశం ఉంది.