Singareni: సింగరేణి.. మరో ఐదు కొత్త బొగ్గు గనుల ప్రారంభానికి సిద్ధం
సింగరేణి మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త గనులను ప్రారంభించేందుకు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ప్రత్యేక ఆదేశాలను కూడా జారీ చేశారు. కొత్తగూడెం వీకే ఓపెన్‌కాస్ట్, ఇల్లందు రొంపేడు, బెల్లంపల్లి గోలేటి, రామగుండం కోల్‌మైన్ గనులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రోజుకు కనీసం రెండు లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
72 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తే లక్ష్యం
ఇటీవల సింగరేణి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో గనుల వారీగా ఉత్పత్తి వివరాలను చర్చించారు. ప్రస్తుత వర్షాలు ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో, లక్ష్యం చేరుకోలేమని జీఎంలు వెల్లడించారు. 72 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు, అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని సీఎండీ ఎన్ బలరాం పిలుపునిచ్చారు.