Tirupati: వలసలు,డబుల్ ఎంట్రీలు,ఆచూకీ లేని ఓటర్లు.. 'సర్'లో బయటపడిన వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన (సర్)లో తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో తొలగించాల్సిన ఓట్లు గుర్తించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలు సూచిస్తున్నాయి. మొత్తం 2,95,288 మంది ఓటర్లలో 90,882 మంది (30.77 శాతం) తొలగింపు జాబితాలో ఉండటం విశేషం. అంటే దాదాపు మూడో వంతు ఓట్లపై పరిశీలన అవసరమని తేలింది. తొలగింపు జాబితాలో ఉన్న వారిలో 57 వేల మందికిపైగా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లినట్లు నమోదు కాగా, 20 వేల మందికిపైగా తమ చిరునామాల్లో లేని లేదా వారి వివరాలు లభ్యం కాని వారిగా గుర్తించారు. మరో 6 వేల మందికిపైగా ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు ఉన్నట్లు డబుల్ ఎంట్రీలు బయటపడ్డాయి.
వివరాలు
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో దొంగ ఓటర్లతో పోలింగ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో కల్పిత చిరునామాలు, వ్యక్తుల పేర్లతో పెద్దఎత్తున ఓట్లు చేర్చారని, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు సృష్టించి దొంగ ఓటర్లతో పోలింగ్ నిర్వహించారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.
ప్రస్తుతం 'సర్' పరిశీలనలో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో తొలగించాల్సిన ఓట్లు గుర్తించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాయలసీమతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా గతంలో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయనే ఆరోపణలు ఉండగా, వాటిలో అనేకం ఇప్పుడు పరిశీలనలో బయటపడినట్లు చెబుతున్నారు.
వివరాలు
కర్నూలులోనూ భారీ సంఖ్యలో అనుమానాస్పద ఓట్లు
కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 2,74,622 ఓటర్లలో 67,755 మంది (24.67 శాతం) తొలగింపు జాబితాలో చేరారు.
వీరిలో 28,594 మంది శాశ్వతంగా వలస వెళ్లగా, 21,210 మంది తమ చిరునామాల్లో లేని లేదా వివరాలు లభ్యం కాని వారిగా గుర్తించారు.
మరో 11,449 మందికి రెండేసి ఓట్లు ఉన్నట్లు తేలింది. 2024 ఎన్నికలకు ముందే కర్నూలులో భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన విషయం ప్రస్తావనకు వస్తోంది.
వివరాలు
పాణ్యంలో డబుల్ ఎంట్రీలు అధికం
పాణ్యం నియోజకవర్గంలో 3,35,015 మంది ఓటర్లలో 51,985 మంది (15.52 శాతం) తొలగింపు జాబితాలో ఉన్నారు.
ఇందులో 15,235 మంది ఆచూకీ లభ్యం కాని వారు, 15,065 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు. 12 వేల మందికిపైగా ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు నమోదైనట్లు గుర్తించారు.
కర్నూలు జిల్లాలో మొత్తం 60,768 డబుల్ ఎంట్రీ ఓట్లు గుర్తించగా, వాటిలో అత్యధికం కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల్లోనే నమోదయ్యాయి.
వివరాలు
కడపలో 32 వేల మందికి ఆచూకీ లేదు
కడప శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 2,83,973మంది ఓటర్లలో 67,031మంది (23.60 శాతం) తొలగింపు జాబితాలో చేరారు.
వీరిలో 32,073మంది తమ చిరునామాల్లో అందుబాటులో లేని లేదా వారి వివరాలు లభ్యం కాని వారిగా గుర్తించారు.
బీఎల్‌వోల క్షేత్రస్థాయి పరిశీలనలో వీరి ఉనికి నిర్ధారించలేకపోయినట్లు వెల్లడైంది.
అదే విధంగా 18,557 మంది శాశ్వతంగా వలస వెళ్లగా,8,669మందికి రెండేసి ఓట్లు ఉన్నట్లు తేలింది.
ఈ నియోజకవర్గంలో నమోదైన అనుమానాస్పద ఓట్లలో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని ఉపయోగించి నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా చిరునామాల్లో లేని లేదా వివరాలు లభ్యం కాని ఓటర్లు అత్యధికంగా 79,402 మంది కడప జిల్లాలో ఉండగా,అందులో దాదాపు సగం కడప నియోజకవర్గానికే చెందినవారు కావడం గమనార్హం.
వివరాలు
చంద్రగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్‌లోనూ..
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 3,13,795ఓటర్లలో 50,273ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి.
వీరిలో 19వేల మందికిపైగా ఆచూకీ లభ్యం కాని వారు కాగా,16వేల మందికిపైగా శాశ్వతంగా వలస వెళ్లినవారిగా గుర్తించారు.
ఇవి గత ప్రభుత్వ హయాంలో నమోదైన దొంగ ఓట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,82,312మంది ఓటర్లలో 57,948మందిని తొలగింపు జాబితాలో చేర్చారు.
ఇందులో 18,287మంది ఆచూకీ లేని వారు,21,911మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు,7,929ఓట్లు డబుల్ ఎంట్రీలుగా తేలాయి.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మొత్తం 2,82,463మంది ఓటర్లలో 53,790మంది తొలగింపు జాబితాలో చేరారు.
వీరిలో 14,816మంది ఆచూకీ లేని వారు, 17,861 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు కాగా, 10,556 డబుల్ ఎంట్రీలు గుర్తించినట్లు ఎన్నికల పరిశీలనలో వెల్లడైంది.