LOADING...
SIR: 12 రాష్ట్రాలు/యూటీల్లో 'ఎస్‌ఐఆర్‌'.. ఈసీ కీలక ప్రకటన 
12 రాష్ట్రాలు/యూటీల్లో 'ఎస్‌ఐఆర్‌'.. ఈసీ కీలక ప్రకటన

SIR: 12 రాష్ట్రాలు/యూటీల్లో 'ఎస్‌ఐఆర్‌'.. ఈసీ కీలక ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. రెండవ దశలో మొత్తం 12 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. బిహార్‌లో జరిగిన మొదటి దశ సవరణను విజయవంతంగా పూర్తిచేసినట్లు కూడా ఈసీ తెలిపింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, "ఎస్‌ఐఆర్ రెండవ దశపై చర్చించడానికి మనం ఇక్కడ కలిశాం. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న 7.5 కోట్ల బిహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తొలి దశ అనంతరం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో సమావేశమై విస్తృతంగా చర్చించాం" అని అన్నారు.

వివరాలు 

రాష్ట్రాలు, యూటీలలో కలిపి సుమారు 51కోట్ల మంది ఓటర్లు

అదే సమయంలో,రెండో దశలో భాగమయ్యే రాష్ట్రాలు, యూటీల జాబితాను కూడా వెల్లడించారు. అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్,కేరళ,లక్షద్వీప్‌,మధ్యప్రదేశ్,పుదుచ్చేరి,రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఈ దశ జరగనుంది. ఈ రాష్ట్రాలు, యూటీలలో కలిపి సుమారు 51కోట్ల మంది ఓటర్లు ఉండనున్నారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 9న విడుదల చేస్తామని,తుది జాబితాను ఫిబ్రవరి 7న ప్రకటిస్తామని ఆయన వివరించారు. ఈ ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశ్యం ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను తొలగించి, ఖచ్చితమైన, విశ్వసనీయమైన జాబితాను సిద్ధం చేయడమే. 1951 నుంచి ఇప్పటివరకు ఈ ప్రక్రియను ఎనిమిది సార్లు నిర్వహించామని, చివరిసారి 2002-2004 మధ్య ఈ సవరణ జరిగిందని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.

వివరాలు 

అస్సాంలో ఓటర్ల జాబితా సవరణను విడిగా నిర్వహిస్తాం

వలసలు, నకిలీ వివరాలు, అలాగే 2002 నుంచి నమోదైన ఓటర్లలో మరణించిన వారు ఉండటం వంటి కారణాల వల్ల ఇప్పుడు తొమ్మిదో సవరణను చేపట్టడం అవసరమైందని చెప్పారు. రెండవ దశ ఎస్‌ఐఆర్ కోసం పోలింగ్ అధికారుల శిక్షణ మంగళవారం ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అదనంగా, పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రంగా ఆధార్‌ను పరిగణించరాదని, కానీ ఎస్‌ఐఆర్ సమయంలో దాన్ని గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. అస్సాంలో ఓటర్ల జాబితా సవరణను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు కూడా జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.