LOADING...
SIR Phase 3 : ఎఎస్‌ఐఆర్ మూడో దశ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ
ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ

SIR Phase 3 : ఎఎస్‌ఐఆర్ మూడో దశ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రత్యేక సమగ్ర సవరణ మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల సేకరణ చేపట్టనుంది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, చిరునామా సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపుకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు నేరుగా 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను నమోదు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో కొనసాగనుంది.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ మొదటి వారంలోనే సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. జూలై 21న ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, సవరణలకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.

వివరాలు 

తెలంగాణ షెడ్యూల్

తెలంగాణలో ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ కంటే కొద్దిరోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తారు. జూలై 31న ప్రాథమిక ఓటర్ల జాబితా విడుదల అవుతుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, సవరణలకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 1న తుది జాబితాను ప్రకటించనున్నారు.

Advertisement

వివరాలు 

ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు పాల్గొననున్నారు

ఇంట్లో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. అలాగే చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపుకు కూడా ఇది మంచి అవకాశం అని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి వచ్చే అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించాలని ఎన్నికల సంఘం ప్రజలను కోరింది. ప్రత్యేక సమగ్ర సవరణ మూడో దశ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది బూత్ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Advertisement