
Gang Rape: పశ్చిమబెంగాల్‌లో ఒడిశా యువతిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పారిపోయేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పారిపోయిన నిందితుడి సోదరి ఇచ్చిన సమాచారం ఆధారంగా, అతడిని గుర్తించినట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడు సఫీక్ దుర్గాపుర్‌లోని అందాల్ వంతెన కింద దాక్కున్నాడని, అతడి సోదరి రోజినా పోలీసులకు సమాచారం అందించడంతోనే అతడి గుర్తింపు, అరెస్ట్ సాధ్యమైందని అధికారులు చెప్పారు.
వివరాలు
అడవిలోకి లాక్కెళ్లి.. భయానక క్షణాలను గుర్తు చేసుకున్న బాధితురాలు
తన సోదరుడు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాలనే ఉద్దేశ్యంతోనే రోజినా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆమె మీడియాతో తెలిపారు. బాధితురాలు తన అనుభవాలను వివరిస్తూ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో బయటకు వెళ్ళినప్పుడు, పలువురు దుండగులు తమను వెంటాడినట్లు వెల్లడించారు. భయపడి అడవి వైపు పరిగెత్తిన ఆమె, తన స్నేహితుడు వేరొక దిశలో వెళ్లినప్పటి సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళినట్టు తెలిపారు.
వివరాలు
అరిస్తే మరికొందరిని పిలుస్తాము
ఫోన్‌ను లాక్కొని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని.. అతడు రాకపోవడంతో తనపై దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. తనను నిరోధించడానికి ప్రయత్నించినప్పటికీ, "అరిస్తే మరికొందరిని పిలుస్తాము" అని నిందితులు బెదిరించారన్నది బాధితురాలి మాట. ఈ ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు, నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లి సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.