హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలో మత హింస కేసుల దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు.
ఘర్షణల్లో బజరంగ్‌దళ్ సభ్యుడు మోను మనేసర్ పాత్రపై విచారణ జరుగుతోందని అగర్వాల్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో నుహ్ హింసాకాండ తర్వాత కనీసం 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని డీజీపీ చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో హింస చెలరేగింది. ఆ తర్వాత ఆ అల్లర్లు గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారి సహా ఆరుగురు మరణించారు.
ముస్లింలు అధికంగా ఉండే నూహ్‌లో హింసకు సంబంధించిన వార్తలు వ్యాపించడంతో, సోహ్నాలోని ఓ వర్గానికి చెందిన వారు నాలుగు వాహనాలు, దుకాణాన్ని తగులబెట్టారు.
హర్యానా
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ
రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, నుహ్‌లో కొద్దిసేపు కర్ఫ్యూను సడలించినట్లు డీజీపీ పీకే అగర్వాల్ డీజీపీ చెప్పారు.
గురుగ్రామ్ పూర్తిగా సురక్షితంంగా ఉందని, తాజాగా ఎటువంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదన్నారు.
సీనియర్ అధికారులను నుహ్‌లో మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని పోలీసు బలగాలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
హింసాత్మక కేసులన్నింటినీ విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. గురుగ్రామ్‌లోని మసీదు మతాధికారిని హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు.
నుహ్‌లో మొత్తం 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, 116 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో 100 మందికి పైగా అనుమానితులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.