Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. వైద్య కారణాలతో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు బయట ఉన్నారు. కంటి శుక్లాల శస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరైంది. తాజా తీర్పులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందంలో టీడీపీ శ్రేణులు
చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనచ్చా?
చంద్రబాబుకు రెగ్యుల్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన రాజకీయ సభలకు హైజరు కావొచ్చా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబుకు తాజాగా హైకోర్టు జారీ చేసింది కండీషన్ బెయిల్ కాదు. కాబట్టి ఆయన అన్ని రకాల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. నవంబర్ 29 నుంచి రాజకీయ సభలు, ప్రెస్ మీట్లలో చంద్రబాబు పాల్గొనేందుకు గతంలో విధించిన షరతులను కూడా న్యాయమూర్తి రద్దు చేశారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. స్కిల్ కేసులో ఏ-37గా ఉన్న చంద్రబాబును సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున నంద్యాలలో అరెస్టు చేసి ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.