Vande Bharat train: బ్రేకింగ్ వ్యవస్థ ఐసొలేట్.. గూడ్స్ ఇంజిన్‌తో 463 కి.మీ దూసుకెళ్లిన వందే భారత్
ఈ వార్తాకథనం ఏంటి
సరైన బ్రేకింగ్ వ్యవస్థ లేకుండానే ఓ ఖాళీ వందే భారత్ (Vande Bharat) రైలును ఏకంగా 463 కిలోమీటర్ల మేర తరలించడం రైల్వే వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనను సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ తీవ్రంగా పరిగణించింది. తగినంత బ్రేక్ పవర్ లేకుండా రైలును నడపడం తీవ్రమైన భద్రతా లోపమని పేర్కొంది. ఇది ఇతర రైళ్లకు ముప్పుగా మారడంతోపాటు రైల్వే సిబ్బంది ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. అక్టోబరు 24న జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం)ను ఆదేశించింది.
వివరాలు
ముందే గుర్తించిన లోకోపైలట్లు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఝార్ఖండ్‌లోని హతియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ వరకు ఖాళీ వందే భారత్ రైలును గూడ్స్ ఇంజిన్ సాయంతో తరలించాల్సి వచ్చింది.
హతియా నుంచి బయల్దేరిన తర్వాత నిబంధనల ప్రకారం లోకోపైలట్ బ్రేక్ ఫీల్, బ్రేక్ పవర్ పరీక్షలు నిర్వహించారు. అయితే బ్రేకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని గుర్తించారు.
ఈ విషయాన్ని రాంచీ స్టేషన్‌కు చేరుకున్నాక అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రైలును ముందుకు నడిపేందుకు వారు అనుమతించారు.
ఆ తర్వాత మురి స్టేషన్ నుంచి రైలును నడిపిన మరో లోకోపైలట్ కూడా బ్రేకింగ్ పనితీరు సరిగా లేదని గుర్తించి కంట్రోలర్లకు సమాచారం అందించారు. అయినా రైలు ప్రయాణం కొనసాగింది.
వివరాలు
అన్ని కోచ్‌ల్లోనూ బ్రేకింగ్ వ్యవస్థలు ఐసొలేట్
చివరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌లో సిబ్బంది రైలును తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది.
వందే భారత్ రైలులోని అన్ని కోచ్‌ల బ్రేకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు (ఐసొలేట్ చేసినట్లు) గుర్తించారు. వందే భారత్ బ్రేకింగ్ వ్యవస్థను గూడ్స్ ఇంజిన్‌తో అనుసంధానించకపోవడం వల్లే బ్రేకులు పనిచేయలేదని తేల్చారు.
దీంతో కేవలం ఇంజిన్ బ్రేకులు, రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థపైనే ఆధారపడి రైలు సుమారు 463 కిలోమీటర్లు ప్రయాణించినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో సంబంధిత సిబ్బంది అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ ఆదేశించింది.