Drone: డ్రోన్లతో 'స్కై ఎయిర్' ఈ-కామర్స్ సేవలు.. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రస్తుతం ఏ వస్తువు డెలివరీకైనా వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. కిరాణా సరుకులు, భోజన పదార్థాలు వంటి వాటి డెలివరీకి కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. అది కూడా డెలివరీ కేంద్రాలు లేదా భోజనశాలలు సమీపంలో ఉంటేనే సాధ్యం. ఒకవేళ 30 కిలోమీటర్ల దూరం నుంచి సరుకులు రావాలంటే నగర ట్రాఫిక్ రద్దీ కారణంగా గంట నుంచి రెండు గంటల వరకు ఆలస్యం అవుతోంది. అయితే దిల్లీ, బెంగళూరు నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్కై ఎయిర్ సంస్థ హైపర్ లోకల్ డ్రోన్ డెలివరీ విధానం ద్వారా కేవలం 7 నిమిషాల్లోనే సరుకులు అందిస్తోంది. ఇదే విధానాన్ని హైదరాబాద్‌లో కూడా ప్రవేశపెట్టేందుకు సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది.
వివరాలు
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి 'మెడిసిన్స్ ఫ్రం స్కై'కి భాగస్వామ్యం
వచ్చే ఏడాది జూలై నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన హైసియా వార్షికోత్సవ ప్రదర్శనలో ఈ విషయాన్ని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి 'మెడిసిన్స్ ఫ్రం స్కై' కార్యక్రమంలో స్కై ఎయిర్ ఇప్పటికే భాగస్వామ్యంగా ఉంది. గురుగ్రామ్, బెంగళూరులో ఈ సంస్థ వేగవంతమైన డ్రోన్ డెలివరీ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దిల్లీలో రోజుకు సుమారు 12 లక్షల డెలివరీలను నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు 3.75 లక్షల డెలివరీలను లక్ష్యంగా నిర్ణయించారు.
వివరాలు
ఎలా పని చేస్తాయంటే..
డ్రోన్లు గాల్లో సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రత్యేకమైన వర్చువల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మార్గం గిడ్డంగి నుంచి డెలివరీ ప్రాంతం వరకు నిర్దేశించబడుతుంది. అదే మార్గంలో డ్రోన్లు ప్రయాణిస్తాయి. ఈ మార్గంలో ఇతర డ్రోన్లు ఉన్నాయా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. దీనికి ప్రభుత్వ భద్రతా అనుమతులు అవసరం. నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల నుంచి వినియోగదారుల ఆదేశాలు అందిన వెంటనే డ్రోన్లు బయలుదేరతాయి. ఇవి భూమి నుంచి సుమారు 120 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి.
వివరాలు
ఎలా పని చేస్తాయంటే..
గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత డ్రోన్ భూమికి 20 మీటర్ల ఎత్తు వరకు దిగుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో సరుకును సురక్షితంగా వదిలేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 7 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆ తరువాత డెలివరీ సిబ్బంది ఆ సరుకును తీసుకుని వినియోగదారుడికి అందజేస్తారు. పనిని ముగించుకున్న డ్రోన్ తిరిగి తన కేంద్రానికి చేరుకుంటుంది. డ్రోన్ ట్రాకింగ్ కోసం 5జీ మాడ్యుల్ ఉపయోగిస్తారు. ఇది తక్షణ మార్గదర్శకానికి సహాయపడుతుంది. ఒక్కో డ్రోన్ గరిష్టంగా 10 కిలోల వరకు బరువును మోయగలదు.
వివరాలు
లైసెన్స్ ఉంటేనే..
సాధారణంగా డ్రోన్లు కంటికి కనిపించే పరిధిలోనే నడిపిస్తారు. కానీ ఈ డెలివరీ విధానంలో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉండటంతో ప్రత్యేక అనుమతులు అవసరం అవుతాయి. కంటికి కనిపించని దూరం వరకు ఎగిరే అనుమతిని పొందాలి. కొన్ని డ్రోన్లు పూర్తిగా స్వయంచాలకంగా పనిచేస్తాయి. వాటికి నేరుగా నియంత్రణ అవసరం లేకపోయినా, వ్యవస్థ వాటి ప్రయాణాన్ని పర్యవేక్షిస్తుంది. మార్గంలో పక్షులు లేదా ఇతర అడ్డంకులు ఎదురైతే సెన్సర్ల సహాయంతో వాటిని తప్పించుకుంటాయి.
వివరాలు
డ్రోన్ 255 రకాల వివరాలను భద్రపరుస్తుంది
డ్రోన్ గాల్లో ఉన్నంతసేపు నిరంతరం సమాచారాన్ని పంపుతుంది. వేగం, బ్యాటరీ స్థితి, వాతావరణ పరిస్థితులు వంటి 255 రకాల వివరాలను భద్రపరుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా దిగేందుకు పారాచూట్ సదుపాయం కూడా ఉంటుంది. వినియోగదారులు, సంస్థలు డ్రోన్ ఎక్కడ ఉందో ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఈ విధానం ద్వారా సేవలు వేగంగా అందడంతో పాటు ఒక్కో డెలివరీ ద్వారా సుమారు 520 గ్రాముల కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.