SLBC tunnel accident: ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. డీ-2 ప్రాంతంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించిన జాగిలాలు
ఈ వార్తాకథనం ఏంటి
నాగర్‌కర్నూల్ జిల్లాలో కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించే ప్రక్రియలో కొంత పురోగతి నమోదైంది.
ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్ వద్ద కేరళ జాగిలాలు మనుషుల ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం. స్పందించిన సిబ్బంది, ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు.
గల్లంతైన వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది కూరుకుపోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో శనివారం రాత్రి ఒక వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గత 15 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన కార్మికులు నిరంతరం కృషి చేస్తున్నారు.
Details
ఆరడుగులు తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు
డీ-2 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు 6 అడుగుల లోతులో ఒక వ్యక్తికి చెందిన కుడిచేయి కనిపించింది. అప్రమత్తమైన వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని వెలికి తీయడానికి, చుట్టుపక్కల రెండు అడుగుల మేర మరో ఆరడుగుల లోతులో తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అధికారుల సూచనల మేరకు సహాయక బృందాలు అప్రమత్తంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మరొక మృతదేహం కూడా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.