Page Loader
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి.. ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి.. ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష

SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట పరిస్థితి.. ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదం తరువాత, సైన్యం, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, బీఆర్‌వో, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎల్‌అండ్‌టీ వంటి ప్రముఖ సంస్థల బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. అయితే, టన్నెల్‌లో ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల నీరు చేరుతుండటంతో పాటు, భారీగా బురద, రాళ్లు పేరుకుపోవడం సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా మారింది.

వివరాలు 

ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు

ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు గురువారం నుండి ప్రత్యేక చర్యలు ప్రారంభించనున్నారు. సహాయ చర్యలు - ప్రత్యక్ష పర్యవేక్షణ ఘటన స్థలానికి చేరువగా సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ర్యాట్‌హోల్ మైనింగ్ బృందాలు టన్నెల్‌లోని బురదను తొలగిస్తూ, టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్) ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం గ్యాస్‌ కట్టింగ్, లోకోట్రైన్‌ ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. వెంటిలేషన్ ట్యూబ్‌ను సరిచేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే, టన్నెల్‌లోని నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు. టన్నెల్ లోపల, బయట జరిగే పరిణామాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.

వివరాలు 

అనుభవజ్ఞుల సహకారం 

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) అధికారి కర్నల్ పరిక్షిత్ మెహ్రా, మాజీ డీజీ హర్పాల్‌సింగ్, మాజీ అడిషనల్ డీజీ పురుషోత్తం వంటి అనుభవజ్ఞులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సరిహద్దు, కొండ ప్రాంతాల్లో సేవలందించిన వీరి అనుభవాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ప్రమాద ప్రాంతం మట్టి స్వభావం, సహాయ చర్యలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు వీరి సూచనలు తీసుకున్నారు.

వివరాలు 

అధికారుల సమీక్ష - ఆర్మీ, నేవీ చర్చలు 

బుధవారం ఉదయం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి టన్నెల్ ప్రాంతానికి చేరుకున్నారు. జేపీ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు జైప్రకాశ్ గౌర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. అనంతరం, మంత్రులు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆర్మీ, నేవీ,ఎన్‌డీఆర్‌ఎఫ్,ఎస్‌డీఆర్‌ఎఫ్,ర్యాట్ హోల్ మైనర్స్,రాబిన్‌సన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై, టన్నెల్‌లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదనపు మానవ వనరులు, అధునాతన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించి, సహాయ చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.