SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రదేశం తీవ్రమైన ఊబిలా మారింది.
ఈ ప్రమాద స్థితిని అంచనా వేసేందుకు మంగళవారం 34 మంది సభ్యులతో కూడిన సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందం సొరంగంలోకి ప్రవేశించింది.
అయితే, తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి అనుకూల పరిస్థితులు లేవని వారు నిర్ధారించారు.
పైకప్పు కూలిన ప్రదేశంలో 70% బురద, 30% నీరు ఉండటంతో అక్కడ అడుగు పెట్టడమే కష్టమని తేలింది.
13.85 కి.మీ. పొడవైన ఈ సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయక చర్యలకు ప్రధాన సవాలుగా మారాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నీటి కంటే ఎక్కువ బురద ఉంటే,అందులో చేతులు,కాళ్లు కదల్చడం కూడా అసాధ్యమవుతుంది.
వివరాలు
దిగువ భాగంలో 15 అడుగుల లోతైన ఊబిలా మారి..
సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ సహకారంతో ఈ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించింది.
సొరంగం చివర్లో పైకప్పు నుంచి మట్టి పడటం, దిగువ భాగంలో 15 అడుగుల లోతైన ఊబిలా మారిన బురద ఉండటం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో సహాయ చర్యలు చేపట్టడం మరింత కష్టతరమైంది.
అధునాతన కెమెరాలు, ఇతర పరికరాలు సహాయక చర్యలకు వినియోగించినప్పటికీ, అవి కూడా విఫలమయ్యాయి.
డ్రోన్ సాయంతో పరిశీలించాలనుకున్నప్పటికీ, అది అక్కడ పని చేయలేకపోయింది. అంతేకాదు, 12వ కి.మీ. దాటిన తర్వాత రక్షణ బృందాలు బురద, నీటిలో నడిచి వెళ్లాల్సి రావడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎంత కష్టపడి ముందుకు సాగినప్పటికీ, ఆక్సిజన్ సరిపడకపోవడంతో ఎక్కువసేపు అక్కడ ఉండడం సాధ్యపడటం లేదని బృంద సభ్యులు వెల్లడించారు.
వివరాలు
సొరంగంలోని విభాగాల వివరాలు
13.85 కి.మీ. పొడవున్న ఈ సొరంగాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు - A, B, C, D.
A-భాగం: ప్రవేశ ద్వారం నుంచి 12 కి.మీ. వరకు విస్తరించనిది. ఈ ప్రాంతంలో లోకో రైలు వెళ్లగలదు. 10.7 కి.మీ. వరకు నీరు లేకపోగా, 11.30 కి.మీ. వరకు 1.5 అడుగుల నీరు ఉంది.
B-భాగం: 1.50 కి.మీ. పొడవుండే ఈ విభాగంలో లోకో రైలు పట్టాలపై 2.5 అడుగుల నీరు ఉంది. దీని వల్ల భారీ పరికరాలను అక్కడికి తరలించడం సాధ్యపడటం లేదు.
C-భాగం: 310 మీటర్ల పొడవైన ఈ విభాగంలో బురద, నిర్మాణ వ్యర్థాలు, ఇతర సామగ్రి ఉంది. ఇక్కడే 100 మీటర్ల పొడవులో టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిపోయింది.
వివరాలు
టీబీఎం వెనుకభాగం చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనింగ్ బృందాలు
D-భాగం: చివరి 40 మీటర్లు ఈ విభాగంలోకి వస్తాయి. ఇక్కడే కట్టర్ యంత్రం ఉంది.
మంగళవారం రాత్రి ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనింగ్ బృందాలు టీబీఎం వెనుకభాగం వరకు చేరుకున్నాయి.
యంత్రం కుంగిపోయినప్పటికీ, ముందుకు ఇంకా సొరంగం ఉండటాన్ని వారు ఆశ్చర్యంగా చూశారు.
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఆక్సిజన్ సిలిండర్లు అందించాల్సిందిగా రక్షణ బృందం కోరిందని నల్గొండ సీఈ అజయ్‌కుమార్ తెలిపారు.