LOADING...
SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ

SLBC tunnel collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. మూడు రోజులు గడుస్తున్నా 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి 72 గంటలు (మూడు రోజులు) పూర్తయినప్పటికీ, సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ గురించి ఇప్పటికీ స్పష్టత రాలేదు. రక్షణ బృందాలు అనేకసార్లు టన్నెల్‌లోకి ప్రవేశించినా, ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వెనుదిరిగాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎల్ అండ్‌టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, భూగర్భశాస్త్ర నిపుణులు సహాయ చర్యల్లో నిమగ్నమైనా, ఎలాంటి పురోగతి కనిపించలేదు. టన్నెల్‌లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే నెలకొన్నాయని రక్షణ బృందాలు ఉన్నతాధికారులకు వివరించాయి.

వివరాలు 

టన్నెల్‌లో 13.452 కిలోమీటర్ల తరువాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్

టీబీఎం యంత్రం సహాయ చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. యంత్రం వెనుక భాగంలో భారీగా మట్టి, బురద ఉండటంతో రక్షణ బృందాలు ముందుకు సాగలేకపోతున్నాయి. టీబీఎం యంత్రాన్ని కదిలించినట్లయితే పైకప్పు మరొకసారి కూలిపోవచ్చని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. టన్నెల్‌లో 13.452 కిలోమీటర్ల తరువాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్ ఉన్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ బృందాలు టీబీఎం యంత్రాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నాయి. ఇక టన్నెల్ వద్దకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు చేరుకొని, తమ వారిని రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

వివరాలు 

రక్షణ చర్యలు మరింత ప్రమాదకరం 

త్వరలోనే రక్షణ బృందాలు, ఇంజనీర్లు, నిపుణులతో కలెక్టర్, ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నీటిని తొలగించేందుకు మేఘా కంపెనీ నుండి భారీ మోటార్లు తెప్పించే యోచనలో అధికారులు ఉన్నారు. బురదను బయటకు తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. ఎల్ అండ్‌టీ, మేఘా ఇంజనీర్లు, నిపుణుల సహాయాన్ని కోరారు. అయితే, ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు మరింత ప్రమాదకరమని రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.