Mahalakshmi Smart Card: జూన్ నుంచి 'మహాలక్ష్మి' స్మార్ట్‌కార్డులు.. 5 లక్షల మందితో పైలట్ ప్రాజెక్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి'కి సంబంధించిన స్మార్ట్‌కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు ఈ స్మార్ట్‌కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్ తయారీకి సంబంధించి జరుగుతున్న సన్నాహక సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వివరాలు
తొలుత జిల్లాకో మండలంలో అమలు
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలను ఎండీ నాగిరెడ్డి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించనున్న ఉచిత ప్రయాణానికి సంబంధించి స్మార్ట్‌కార్డులను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ మూడు రకాల స్మార్ట్‌కార్డు నమూనాలను ఉప ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రదర్శించారు. ప్రారంభ దశలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌కార్డుల జారీ ప్రక్రియను చేపడతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపినట్లు సమాచారం.
వివరాలు
ఐదు లక్షల మంది మహిళలకు స్మార్ట్‌కార్డులు జారీ
అలాగే ఈ మూడు రకాల స్మార్ట్‌కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చూపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఐదు లక్షల మంది మహిళలకు స్మార్ట్‌కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం. చిప్ సదుపాయంతో రూపొందించే ఈ స్మార్ట్‌కార్డుల తయారీకి సుమారు రూ.75 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా మంజూరు చేయాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలిసింది.