Page Loader
solar power: 81 గ్రామాలలో బోర్లకు సౌర విద్యుత్‌.. మెగావాట్‌కు సగటున రూ.6 కోట్ల వ్యయం! 
81 గ్రామాలలో బోర్లకు సౌర విద్యుత్‌.. మెగావాట్‌కు సగటున రూ.6 కోట్ల వ్యయం!

solar power: 81 గ్రామాలలో బోర్లకు సౌర విద్యుత్‌.. మెగావాట్‌కు సగటున రూ.6 కోట్ల వ్యయం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ వ్యాప్తంగా 81 గ్రామాల్లో సౌరశక్తి ఆధారిత విద్యుత్‌ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటి పైకప్పుపై, వ్యవసాయ బోర్లపై, అలాగే ఇతర విద్యుత్‌ కనెక్షన్లకు సౌర ఫలకాల అమరిక చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.1,273 కోట్ల వ్యయంతో టెండర్లు ఆహ్వానిస్తూ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ రూ.400 కోట్లు మద్దతుగా అందించనుండగా, మిగతా రూ.873 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. టెండర్ దాఖలుకు గడువును ఈ నెల 24వ తేదీగా నిర్ణయించారు.

వివరాలు 

 16,840వ్యవసాయ బోర్లకు 7.5కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు 

ఈ ప్రాజెక్టులో భాగంగా 16,840వ్యవసాయ బోర్లకు 7.5కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేయనున్నారు. ఈఫలకాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ముందుగా బోర్లకు వినియోగించనున్నా,మిగిలిన విద్యుత్‌ మొత్తాన్ని సాధారణ విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. ఈసరఫరా కారణంగా,బోరు యజమానులకు డిస్కంలు యూనిట్‌కి రూ.3.13చొప్పున చెల్లిస్తాయి.దీని వల్ల వారు వ్యవసాయంతో పాటు అదనంగా ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఒక బోరుకు సౌర ఫలకాలను ఏర్పాటు చేయాలంటే సుమారుగా రూ.4.50 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో 30 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుండగా,మిగిలిన మొత్తం రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత సౌర విద్యుత్ సంస్థలకు చెల్లించనుంది.

వివరాలు 

ఒక్కో ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం 

ఈ 81 గ్రామాల్లోని ప్రతి ఇంటి పైకప్పుపై 2 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి మరో టెండర్‌ను రెడ్కో ప్రకటించింది. మొత్తం 40,349 ఇళ్లపై 80,698 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలు అమర్చే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ బోర్ల కోసం 126.30 మెగావాట్లు, ఇళ్ల కోసం 80.69 మెగావాట్లను కలిపి మొత్తం 206.99 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌కు కేటాయించిన రూ.1,273 కోట్లను బట్టి చూస్తే, ఒక్కో మెగావాటుకు సగటున రూ.6.15 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.

వివరాలు 

మెగావాటుకు రూ.6.15 కోట్లు ఖర్చు

సాధారణంగా భూమి అందుబాటులో ఉంటే మెగావాటుకు రూ.4 కోట్లలోపు ఖర్చవుతుందని రెడ్కో భావిస్తోంది. అయితే ఈ పథకంలో భూసేకరణ అవసరం లేకుండానే ఇళ్లపై, బోర్ల వద్ద సౌర ప్యానెల్‌లు ఏర్పాటు చేస్తున్నందున మెగావాటుకు రూ.6.15 కోట్లు ఖర్చు కావడం సహజమని తెలిపింది. ఈ 81 గ్రామాల్లో ఈ పథకం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని గ్రామాల్లో ఇదే విధంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.