LOADING...
Andhra Pradesh: సౌర ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం.. మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లకు ఏర్పాటు 
సౌర ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం.. మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లకు ఏర్పాటు

Andhra Pradesh: సౌర ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం.. మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లకు ఏర్పాటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

పీఎం కుసుమ్‌ పథకం కింద ఏపీలో ఫీడర్ల వద్ద మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు చేపట్టిన టెండర్లలో గుత్తేదారులు యూనిట్‌ విద్యుత్‌ ధరకు కనిష్ఠంగా రూ.3.19 నుంచి గరిష్ఠంగా రూ.3.60 వరకు కోట్‌ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 1,185.80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కంలు ఈ ఏడాది మార్చిలో సర్కిల్‌ వారీగా టెండర్లు విడుదల చేశాయి. త్వరలోనే వాటిని గుత్తేదారులకు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లక్ష్యాల ప్రకారం వచ్చే ఏడాది మార్చిలోపు ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల కోసం 5,983ఎకరాల భూములను గుర్తించటం పూర్తయింది.

వివరాలు 

మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లు 

పథకంలోని మొదటి దశలో ప్రభుత్వం 3లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సరిపడే ప్రాజెక్టుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1,185 మెగావాట్ల సామర్థ్యంతో డీపీఆర్‌లు తయారు చేసి కేంద్రానికి పంపించింది. అనంతరం మరికొన్ని దశలుగా మరో 2 లక్షల కనెక్షన్ల కోసం ప్రాజెక్టుల అనుమతులను పొందాలన్నదే ప్రభుత్వ ఆలోచన. మొత్తంగా 3,725 మెగావాట్ల మేర మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ ప్రణాళిక. మొదటిదశలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో మెగావాట్‌ ప్రాజెక్టుకు రూ.1.04 కోట్లు మంజూరు చేయనుంది.

వివరాలు 

విభాగాల వారీగా ప్రాజెక్టుల వివరాలు 

ఎస్‌పీడీసీఎల్ పరిధిలో: మొత్తం 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. ఇందులో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం 3,055 ఎకరాల ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ భూములను గుర్తించారు. సీపీడీసీఎల్ పరిధిలో: నాలుగు సర్కిళ్లలో 355.50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసారు. వీటి కోసం 1,842 ఎకరాల భూములను గుర్తించారు. ఈపీడీసీఎల్ పరిధిలో: 220.30 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేసారు. ఈ ప్రాజెక్టుల కోసం 1,086.5 ఎకరాల భూములను గుర్తించటం జరిగింది.

వివరాలు 

ప్రభుత్వంపై తగ్గనున్న సబ్సిడీ భారం 

ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ఏటా సుమారు రూ.12,000 కోట్లు ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీగా చెల్లిస్తోంది. ఇప్పుడు మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుతో ఈ భారం కొంత మేర తగ్గనుంది. ప్రస్తుతం డిస్కంలకు విద్యుత్‌ కొనుగోలు, నిర్వహణ, పంపిణీ నష్టాలను కలుపుకుని ఒక్క యూనిట్‌కు సగటున రూ.7.50 ఖర్చవుతోంది. అయితే, కుసుమ్‌ పథకం కింద గరిష్ఠంగా యూనిట్‌కు రూ.3.60కే గుత్తేదారులు కోట్‌ చేశారు. అంటే ప్రభుత్వం ఒక్క యూనిట్‌ విద్యుత్‌ విషయంలో రూ.3.90 ఆదా చేసుకునే అవకాశం ఉంది. పైగా, ఫీడర్‌ వద్దే ప్రాజెక్టులు ఉండడం వల్ల సరఫరాలో నష్టాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.