దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ
హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరులోని ఎంజి రోడ్ అగ్రస్థానంలో ఉంది. లింకింగ్ రోడ్ (ముంబై), సౌత్ ఎక్స్‌టెన్షన్ (దిల్లీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నైట్ ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ చేసిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు సోమాజిగూడ మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోందిని సర్వే తెలిపింది. భారతదేశంలోని ఏడు మెట్రో నగరాల్లో హై స్ట్రీట్లపై 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 - హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్' పేరుతో నైట్ ఫ్రాంక్ ఇండియా వార్షిక రిటైల్ నివేదికను విడుదల చేసింది. టాప్ ఎనిమిది మార్కెట్లలో 30 హై స్ట్రీట్‌లను ఎంపిక చేశారు. అందులో సోమాజిగూడకు స్థానం దక్కింది.
హైస్ట్రీట్ల ద్వారానే నగరాలకు గుర్తింపు: నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్
విశాలమైన వీధులు, పార్కింగ్ సౌకర్యాలు, వివిధ రకాలైన రిటైలర్‌లతో సౌకర్యాలను హై స్ట్రీట్ ప్రమాణాలను సర్వే సంస్థ నిర్దారించింది. ఖాన్ మార్కెట్ (దిల్లీ), డీఎల్ఎఫ్ గలేరియా (గురుగ్రామ్) వంటి మార్కెట్‌లు చాలా తక్కువ స్కోర్‌ను సాధించగా, ఎంజీ రోడ్ (బెంగళూరు), సోమాజిగూడ (హైదరాబాద్), లింకింగ్ రోడ్ (ముంబై), అన్నా నగర్, పార్క్ స్ట్రీట్ వంటి యాక్సెస్ రోడ్డు వెంబడి మార్కెట్‌లు టాప్‍లో నిలిచాయి. కామాక్ స్ట్రీట్ (కోల్‌కతా) కూడా మెరుగైన స్కోరు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు వాటి హైస్ట్రీట్ల ద్వారానే గుర్తించబడతాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు. నగరం ప్రధాన ఆకర్షణలలో ఇవి కూడా భాగం అవుతాయని వెల్లడించారు.