Sonia Gandhi: శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరారు. స్వల్ప శస్త్రచికిత్స కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది. అయితే చికిత్సకి సంబదించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. 79 ఏళ్ల సోనియా గాంధీ గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఇటీవలి నెలల్లో సోనియా గాంధీ పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలో అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో ఆమె పిల్లలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ఆమెతో ఉన్నారు.
వివరాలు
ఢిల్లీలో చలి, కాలుష్యం కారణంగా సోనియాకు బ్రాంకియల్ ఆస్థమా
అంతకుముందు జనవరిలో శ్వాసకోశ సమస్యల కారణంగా కూడా ఆమె ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలో చలి, కాలుష్యం కారణంగా బ్రాంకియల్ ఆస్థమా తీవ్రత పెరిగిందని వైద్యులు తెలిపారు. రెండు దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్న సోనియా గాంధీ రెండు సార్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కూడా పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేరళలో యూడీఎఫ్ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ నేతలు మంగళవారం ఆమె నివాసంలో సమావేశమైనట్లు సమాచారం. అయితే కొత్త సీఎం పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ప్రకటించలేదు.