
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు - సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో Enforcement Directorate (ఈడీ) కీలక ముందడుగు వేసింది.
ఈ కేసుకు సంబంధించి తాజాగా దాఖలైన ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పేర్కొంది.
ఈ కేసులోని ఆస్తుల స్వాధీనం కోసం ఈడీ ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
తాజాగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలైన ఛార్జిషీట్‌లో కేవలం సోనియా, రాహుల్ గాంధీలే కాకుండా, కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగాధ్యక్షుడు శామ్ పిట్రోడా పేరు కూడా చేర్చబడి ఉంది.
ఈ కేసుపై విచారణను ఢిల్లీ స్పెషల్ కోర్టు ఏప్రిల్ 25న చేపట్టనున్నట్లు సమాచారం అందుతోంది.
వివరాలు
విదేశాల నుండి వచ్చిన నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిపినట్లు ఆరోపణ
ఇదిలా ఉండగా, ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
విశేషమేమంటే, హర్యానాలోని ఒక రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను కేంద్రంగా చేసుకుని ముడిపడిన మనీలాండరింగ్ కేసులో,గతంలోనే ఈడీ అధికారులు సోనియా గాంధీ,రాహుల్ గాంధీలను అనేకసార్లు విచారించిన సంగతి తెలిసిందే.
విదేశాల నుండి వచ్చిన నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారన్నఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో ఈడీతో పాటు సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
వివరాలు
సంబంధిత ప్రాంతాల్లోని వ్యక్తులకు నోటీసులు జారీ
అయితే, సీబీఐ విచారణ మధ్యలోనే ఆగిపోయినప్పటికీ, ఈడీ మాత్రం తన దర్యాప్తును కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో 2023 నవంబర్‌లో ఈడీ జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన ఆస్తుల స్వాధీన ప్రక్రియను కూడా ప్రారంభించింది.
ఇందుకోసం సంబంధిత ప్రాంతాల్లోని వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
ఆ ఆస్తులను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టంగా పేర్కొంది.అలాగే,ఇప్పటివరకు అద్దెకు చెల్లించిన డబ్బును ఇకపై ప్రత్యక్షంగా ఈడీకి చెల్లించాల్సిందిగా తెలిపింది.
ఈ స్వాధీన ప్రక్రియ,అక్రమ ఆస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 5(1)ప్రకారం జరిగిందని ఈడీ స్పష్టం చేసింది.
ఈ ఆస్తులు దిల్లీ,ముంబయి,లఖ్‌నవూ నగరాల్లో ఉండగా,వాటిపై నోటీసులు అంటించినట్లు తెలిపింది.
తాజా ఛార్జిషీట్‌తో పాటు,ఈకేసులో తదుపరి విచారణను త్వరలో ప్రారంభించనున్నట్లు ఈడీ వెల్లడించింది.