త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సికింద్రాబాద్ -నాగపూర్ మధ్య మంచి వాణిజ్య, వ్యాపారం సంబధాలు ఉన్నాయి. రెండు నగరాల మధ్య నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణీకులు ప్రయాణిస్తారు. నాగపూర్- సికింద్రాబాద్ రైల్వే మార్గంలో ప్రస్తుతం 25రైళ్లు నడుస్తున్నప్పటికీ రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లాంటి సూపర్ ఫాస్ట్ రైలు లేవు. అందుకే వందేభారత్ రైలును ఈ మార్గంలో నడపాలని కేంద్రం యోచిస్తోంది. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య దూరం 581కిమీ దూరం ఉంటుంది. దాదాపు 10గంటల సమయం పడుతుంది. వందేభారత్‌ను తీసుకురావడం వల్ల ఈ ప్రయాణ సమయం 6గంటలకు తగ్గనుంది.
వ్యాపారం, వాణిజ్య అభివృద్ధికి ఈ రైలు దోహదం
సికింద్రాబాద్- వైజాగ్, సికింద్రాబాద్- తిరుపతి భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్- హైదరాబాద్ మధ్య నడిపేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలు కాజీపేట్, రామగుండం, కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా జంక్షన్‌లో ఆగే అవకాశం ఉంది. హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య వందేభారత్ నడిస్తే వ్యాపారం, వాణిజ్య పరంగా చాలా దోహదపడుతుంది. అయితే ఈ రైలు నాగ్ పూర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ నాగ్‌పూర్ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.