
నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం
ఈ వార్తాకథనం ఏంటి
రానున్న 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాన్ రూపం దాల్చనుంది.
దీని మూలానే మరో 3 రోజుల వరకు నైరుతి రుతుపవనాలు ఆలస్యం కానుందని ప్రైవేట్ వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ బుధవారం వెల్లడించింది.
మొత్తంగా జూన్ 12 వస్తే గానీ నైరుతి పవనాలు పూర్తిగా కేరళ తీరాన్ని తాకలేవు అని స్పష్టం చేసింది.
జూన్ 1 అంటేనే తొలకరి జల్లులు :
జూన్ మాసం ప్రారంభమైందంటే చాలు భారతదేశంలో వర్షాల కోసం అందరూ ఎదురు చూస్తారు.
నెల ప్రారంభం రోజుల్లోనే తొలకరి జల్లులు కురుస్తాయి. అలాంటిది వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఒక్క చినుకు జాడైనా కానరాలేదు.కారణం నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం కానుండటమే.
South West Monsoon Arrival Late For 3 More Days
నైరుతి వల్లే భారత్ లో పుష్కలమైన నీటినిల్వలు
ఏటా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అనంతరం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి.
వీటి విస్తరణతోనే మంచి వర్షాలు కురుస్తాయి. నైరుతి పుణ్యానే దేశంలోని అన్ని ప్రధాన నదులు పొంగి పొర్లి, పెద్ద పెద్ద జలశయాలతో ప్రారంభమై చెరువుల వరకు అన్ని నిండుకుండలా మారతాయి.
ఈ రుతు పవనాలు దేశ వ్యవసాయానికి, భారత ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని నీటి అవసరాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే సమకూరుతాయంటే అతిశయోక్తి కాదు.