తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. జూన్ 20న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సాయంత్రం వాన దంచికొట్టింది. క్రమంగా అక్కడ్నుంచి విస్తరిస్తున్న నైరుతి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో రానున్న 2 నుంచి 3 రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలకు, ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో సగటున సముద్ర మట్టం నుంచి 3.1 కిమీ నుంచి 5.8 కిమీ వరకు ఆవర్తనం కొనసాగుతుందన్నారు.
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం : హైదరాబాద్ వాతావరణ కేంద్రం
రానున్న మూడు రోజుల వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం పడొచ్చని అంచనా వేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సహా ములుగు జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.