LOADING...
Heavy Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతం.. ముంచుకొస్తున్న అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక
ఆగ్నేయ బంగాళాఖాతం.. ముంచుకొస్తున్న అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక

Heavy Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతం.. ముంచుకొస్తున్న అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశలో కదలుతూ, దక్షిణ మధ్య, మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 22 నుండి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Details

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అక్టోబర్ 21 మధ్యాహ్నం నుండి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సూచించారు. సముద్రంలో ఉన్నవారికి 21వ తేదీ లోపు తీరానికి రావాలని, వాతావరణ మార్పులను గమనించి జాగ్రత్తలు పాటించాలని ఆయన ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మత్స్యశాఖ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు.

Details

తెలంగాణలో వాతావరణం

ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కడెక్కడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కడెక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ రోజు, రేపు తెలంగాణలో కొన్ని జిల్లాలలో తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.