Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకూ రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా వరకు మరో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏర్పడినట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
వివరాలు
ఈ ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
వాతావరణశాఖ వివరాల ప్రకారం, గురువారం అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాలు
తెలంగాణలోనూ వర్షాల జోరు
తెలంగాణలో కూడా రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.